నర్సన్న దర్శనానికి ఏడాది ఆగాల్సిందే.!

నర్సన్న దర్శనానికి  ఏడాది ఆగాల్సిందే.!
  • టెంపుల్ ఫినిషింగ్ వర్క్స్ కే మరో ఆరు నెలలు
  • ఇప్పటివరకు మౌలిక వసతుల ఊసే లేదు
  • నాలుగేళ్లుగా సాగుతున్న పునర్నిర్మాణ పనులు
  • ఫండ్స్​టైంకు రాకనే  లేటవుతోందంటున్న ఆఫీసర్లు

యాదాద్రి, వెలుగు: వచ్చే మూడు, నాలుగు నెలల్లో యాదాద్రి టెంపుల్ పనులు కంప్లీట్​చేయాలని  సీఎం కేసీఆర్​ఇటీవల ఆదేశించినా ఫీల్డ్​ లెవల్​లో ఆ పరిస్థితి కనిపిస్తలేదు. యాదాద్రి ఆలయం, టెంపుల్​టౌన్​ డెవలప్​మెంట్​కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ. 780 కోట్లు ఖర్చు చేసినప్పటికీ  చాలా వర్క్స్​ఇంకా పెండింగ్​లోనే ఉన్నాయి. ప్రధాన ఆలయం​పనులు 99 శాతం కంప్లీట్​ అయ్యాయని వైటీడీఏ చైర్మన్​ ప్రకటించినా టెంపుల్​ ఫినిషింగ్, ఎలివేషన్​ పనులకే మరో ఆరు నెలలు పడుతుందని ఆఫీసర్లు అంటున్నరు. ఇక  భక్తుల మౌలిక వసతులకు సంబంధించిన పనులు ఇంకా మొదలేకాలేదు. ఇవన్నీ పూర్తి కావాలంటే మరో రూ.400 కోట్లకుపైగా ఖర్చవుతుందని చెబుతున్నరు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం దృష్ట్యా యాదాద్రిలో పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు బిల్లులు​ఎప్పటికప్పుడు రిలీజ్​ కావడం లేదు. అందువల్లే పనుల్లో ఆశించిన ప్రోగ్రెస్​ కనిపిస్తలేదు.

 వైటీడీఏకు రూ.1200 కోట్లు..

కేసీఆర్ తెలంగాణ​సీఎంగా బాధ్యతలు స్వీకరించిన కొత్తలోనే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని పునర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు 2016లో  ‘యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్​మెంట్​ అథారిటీ (వైటీడీఏ)’ ఏర్పాటు చేసి రూ. 1200 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఫండ్స్​తో టెంపుల్​ రీకన్ స్ట్రక్షన్​తో పాటు టెంపుల్​సిటీ డెవలప్​మెంట్, ఇందుకు కావాల్సిన భూసేకరణ చేయాలని భావించారు. ఈ క్రమంలో ​గడిచిన నాలుగేళ్లలో యాదాద్రిలో రూ. 780 కోట్ల విలువైన పనులు చేసినట్లు వైటీడీఏ వైస్​చైర్మన్​కిషన్​రావు ఇటీవల ప్రకటించారు. ఇందులో టెంపుల్​ కోసం రూ.270 కోట్లు, భూసేకరణ, టెంపుల్​ సిటీ డెవలప్​మెంట్​కు మిగిలిన రూ.510 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. టెంపుల్​ నిర్మాణం పూర్తికావస్తున్నా భక్తుల కోసం కొండమీద, కొండకింద చేపట్టిన నిర్మాణాల్లో మాత్రం స్పీడ్​ కనిపించడం లేదు.

ఈ పనుల సంగతేంది?

యాదాద్రి టెంపుల్​ పనుల ప్రోగ్రెస్​పై ఈ నెల 7న సీఎం కేసీఆర్​హైదరాబాద్​లో రివ్యూ చేశారు. పనులను రాబోయే 3, 4 నెలల్లో పూర్తి చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. వాస్తవానికి మెయిన్​టెంపుల్​పనులు 99 శాతం పూర్తయినట్లు సర్కారు చెబుతున్నా, ఫినిషింగ్​వర్క్స్​కే మరో ఆరు నెలలు పడుతుందని ఆఫీసర్లు చెబుతున్నారు. ఆలయ నిర్మాణం పూర్తయితే  సగటున రోజుకు 40 వేల చొప్పున భక్తులు వస్తారని సీఎం కేసీఆర్ అంటున్నారు. ఆ అంచనా మేరకే భక్తుల కోసం మౌలిక వసతులు కల్పించాలని నిర్ణయించారు. కానీ ఇప్పటివరకు కొంత భూసేకరణ, టెంపుల్​ నిర్మాణం తప్ప ఇతరత్రా పనుల్లో ప్రోగ్రెస్​ కనిపించట్లేదు. కొండచుట్టూ కీలకమైన రింగ్​రోడ్డు నిర్మాణానికి ఇంకా భూసేకరణ చేయాల్సి ఉంది. ఇందుకోసమే పెద్దమొత్తంలో ఫండ్స్​ అవసరమవుతాయని భావిస్తున్నారు. యాదాద్రి పక్కనే పెద్ద గుట్టపై 1900 ఎకరాలను సేకరించినా ఇక్కడ 580 కాటేజీలు, అన్నదాన సత్రాల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. కొండకింద ఆర్టీసీ బస్సుల కోసం బస్టాండ్​ నిర్మాణం పెండింగ్​లో ఉంది. ముందుగా అనుకున్నట్టు 6 వేల వెహికల్స్​కోసం పార్కింగ్​ప్లేస్​ డెవలప్​చేయాలని నిర్ణయించారు. స్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తుల క్యూలైన్​ఎక్కడి నుంచి ఎంత పొడవున ఏర్పాటు చేయాలనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. కొండమీదికి వెళ్లడానికి మెట్ల నిర్మాణం కూడా పూర్తికాలేదు. గుట్టపై గతంలో ఉన్న విష్ణు పుష్కరిణిని కూల్చి కొత్తగా నిర్మిస్తున్నారు. కానీ, ఇక్కడ భక్తుల్ని స్నానం చేయకూడదని చెబుతున్నారు. భక్తుల కోసం కొండ కింద ఉన్న గండిచెరువును పుష్కరిణిగా మార్చాల్సి ఉంది.  ఈ పనులు ఇంకా మొదలుకాలేదు. ఇక స్వామివారి రథశాల, కొండపై ఏకశిలతో 108 అడుగుల  ఆంజనేయుడి విగ్రహం ప్రతిష్ఠాపన.. ఇలా అన్ని పనులూ పెండింగ్​లో ఉన్నాయి.

ఫండ్స్ టైంకి రాకే పనులు లేట్

టెంపుల్, గుట్ట మీద డెవలప్​మెంట్​వర్క్స్​చేస్తున్న కాంట్రాక్టర్లకు బిల్లులను ఇన్​టైంలో చెల్లించకపోవడం వల్లే పనుల్లో స్పీడ్​ తగ్గినట్లు తెలుస్తోంది. యాదాద్రికి సీఎం కేసీఆర్​ వచ్చిన ప్రతిసారీ పనులు స్పీడప్​ చేయాలని, 2020లో సుదర్శన యాగం నిర్వహించి ఆలయాన్ని ప్రారంభిస్తామని ఆఫీసర్లను ఆదేశించేవారు. కానీ గతేడాది డిసెంబర్​17న ఇలాగే పనుల స్పీడప్​పై  సీఎం మాట్లాడడంతో ఫండ్స్ టైంకు రావడం లేదనే విషయాన్ని ఆఫీసర్లు ప్రస్తావించారు. రూ.300 కోట్ల పెండింగ్​బిల్లులను క్లియర్​ చేస్తే తప్ప కాంట్రాక్టర్లపై తాము ఒత్తిడి చేయలేమని చెప్పారు. అప్పటి నుంచి సీఎం మాట మార్చేశారు. టెంపుల్​ పునర్నిర్మాణ పనుల్లో తొందరేం లేదని, పనులు నిదానంగా, పటిష్టంగా చేయాలని చెబుతున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్​లో యాదాద్రిలో పర్యటించినప్పుడుకూడా సీఎం ఇలాగే ‘నిదానమే ప్రధానం’ అన్నట్లు మాట్లాడారు. సరిపడా ఫండ్స్​ లేకపోవడమే ఇందుకు కారణమని భావిస్తున్నారు.

భూ సేకరణకే ఖర్చు ఎక్కువైంది

యాదాద్రి పునర్నిర్మాణంలో భూ సేకరణకే ఖర్చు ఎక్కువ అయింది.  ప్రస్తుత, భవిష్యత్​ అవసరాల దృష్ట్యా 1,900 ఎకరాలు సేకరించాం. టెంపుల్​ నిర్మాణం చివరిదశకు వచ్చింది. కొండ కింద రింగ్​బైపాస్​ సహా ఇతర పనులు స్టార్ట్​ అయ్యాయి. అన్ని పనులు తొందరలోనే పూర్తవుతాయి. టెంపుల్​ఎప్పుడు ప్రారంభించాలనేది సీఎం కేసీఆర్​ నిర్ణయిస్తారు.

– వైటీడీఏ వైస్​ చైర్మన్​ కిషన్​రావు