పారిస్: ఇటలీ స్టార్ ప్లేయర్, వరల్డ్ నంబర్‌వన్ యానిక్ సినర్.. ఫ్రెంచ్ ఓపెన్‌లో బోణీ చేశాడు. మంగళవారం రాత్రి జరిగిన మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో టాప్ సీడ్ సినర్ 6–1, 6–3, 6–4తో క్లెమెంట్ టాబుర్ (ఫ్రాన్స్)పై గెలిచాడు. దాంతో తన వరుస విజయాల సంఖ్యను 30కి పెంచుకున్నాడు. రెండు గంటలా 8 నిమిషాల మ్యాచ్‌లో సినర్ తన ట్రేడ్‌మార్క్ షాట్లతో అలరించాడు. మ్యాచ్ మొత్తంలో 8 ఏస్‌లు, ఒక డబుల్ ఫాల్ట్ చేసిన సినర్ 5 బ్రేక్ పాయింట్లను కాపాడుకున్నాడు. 40 విన్నర్లతో మ్యాచ్‌ను ముగించాడు.
ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ నెగ్గిన 24 ఏళ్ల సినర్ కెరీర్ గ్రాండ్ స్లామ్ పూర్తి చేయడానికి ఫ్రెంచ్ ఓపెన్ ట్రోఫీ మాత్రమే మిగిలి ఉంది. రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో జొకోవిచ్ (సెర్బియా) 6–3, 6–2, 7–6 (9/7), 6–3తో వాలెంటిన్ రోయర్ (ఫ్రాన్స్)పై, రబ్లెవ్ (రష్యా) 6–1, 1–6, 6–3, 7–6 (7/5)తో ఉగో కార్బెల్లా (అర్జెంటీనా)పై గెలిచారు.
విమెన్స్ సింగిల్స్ రెండో రౌండ్‌లో టాప్ సీడ్ ఇగా స్వైటెక్ (పోలెండ్) 6–2, 6–3తో బెజ్లిక్ (చెక్)పై, స్వితోలినా (ఉక్రెయిన్) 6–0, 6–4తో కైట్లిన్ క్వెవెడో (స్పెయిన్)పై, బెనిసిచ్ (కెనడా) 6–4, 6–0తో మెక్‌నల్లీ (అమెరికా)పై గెలవగా, యులియా స్టారోడుబ్సెవా (ఉక్రెయిన్) 3–6, 6–1, 7–6 (10/4)తో రెండో సీడ్ ఎలినా రిబకినా (కజకిస్తాన్)కు షాకిచ్చింది.
