ఐటీడీఏలో నో మీటింగ్​..!13 నెలలుగా జాడలేని జనరల్ బాడీ సమావేశం

ఐటీడీఏలో నో మీటింగ్​..!13 నెలలుగా జాడలేని జనరల్ బాడీ సమావేశం
  • 2022 జులై 8న చివరిసారి..
  • పట్టించుకోని ఐటీడీఏ ఆఫీసర్లు
  • నోరుమెదపని ప్రజాప్రతినిధులు
  • సమస్యలతో గిరిజనులు సతమతం 

భద్రాచలం, వెలుగు: ఐటీడీఏలో సమస్యలు తాండవిస్తున్నాయి. వాటిని పట్టించుకునే నాథుడే లేకుండాపోయాడు. ఐటీడీఏ అభివృద్ధి కోసం ప్రతి మూడు నెలల కోసారి జనరల్​బాడీ మీటింగ్​ను నిర్వహిస్తుంటారు. కాని ఏడాదైనా ఆ ఊసే లేకుండాపోయింది.13 నెలలైనా మీటింగ్​పెట్టాలన్న విషయాన్నే ఆఫీసర్లు మరచిపోయారు. గతేడాది జులై 8న చివరిసారిగా మీటింగ్​ నిర్వహించారు. గిరిజనులు సమస్యలతో అల్లాడుతుంటే ప్రజాప్రతినిధులు మాత్రం నోరుమెదపడం లేదు. కలెక్టర్ ​చైర్మన్​గా వ్యవహరించే ఐటీడీఏలో అభివృద్ధి పనులు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. ఐటీడీఏ పరిధిలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, అన్ని శాఖల ఆఫీసర్లు గిరిజనాభివృద్ధికి చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చించి జనరల్ ​బాడీ మీటింగ్​లో తీర్మానాలు చేస్తారు. 

ఖర్చు చేసే ప్రతీ పైసాకు ఈ మీటింగ్ తీర్మానం తప్పనిసరి. ఇంతటి ప్రాధాన్యత ఉన్న జనరల్​ బాడీ మీటింగ్​నే ఆఫీసర్లు నిర్వహించకపోవడం విమర్శలకు తావిస్తోంది. వర్షాకాలం మొదలై రెండు నెలలవుతోంది. గిరిజన గ్రామాల్లో వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. ఇటీవలి వర్షాలకు వాగులు, నదులు పొంగి జనజీవనం స్తంభించింది. వ్యవసాయం, పోడు సమస్యలు, ఐటీడీఏలో నిధుల కొరత, బడ్జెట్​ కేటాయింపులో సర్కారు నిర్లక్ష్యం.. ఇలా చెప్పుకుంటూ పోతే సమస్యలు చాలానే ఉన్నాయి. 

బడ్జెట్​...నిధుల కొరతతో సతమతం

2022–-23 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రభుత్వం ఐటీడీఏలకు ‘అసిస్టెంట్స్ టు ఐటీడీఏ’ అనే పథకం ద్వారా నిధులు ఇస్తోంది. దీనిలో భాగంగా రూ.8కోట్లు భద్రాచలం ఐటీడీఏకు కేటాయించారు. వీటిని ప్రతీ మూడు నెలలకు ఒకసారి రూ.2కోట్ల చొప్పున విడుదల చేస్తున్నారు. కానీ చివరి క్వార్టర్​లో రూ.2కోట్లు ఇంకా ఇవ్వనేలేదు. ప్రస్తుతం2023–-24 ఆర్థిక సంవత్సరం నడుస్తోంది. దీనికి సంబంధించి నిధుల ప్రస్తావనే రాలేదు. ఈ నిధులు విడులైతే గిరిజన ఆశ్రమాలు, గురుకులాల్లోని సమస్యలను పరిష్కరించేందుకు వీలవుతుంది. ఇక గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించాలనే లక్ష్యంతో పద్మశ్రీ రామచంద్రయ్య ప్రిన్సిపల్​గా ఆర్ట్స్ స్కూల్​ను భద్రాచలం ఐటీడీఏలో ఏర్పాటు చేశారు. అది కాగితాలకే పరిమితమైంది. దీనికి బడ్జెట్ కేటాయింపు నేటికీ జరగలేదు. ఇప్పటికే ఏడాది గడిచింది. రెండో ఏడాదీ ఇదే పరిస్థితి. గతంలో ఐటీడీఏ వద్ద రూ.కోట్లాదిగా బడ్జెట్ఉండేది. ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్ ​ఆఫీసుకు అవసరమైన వెహికల్స్​కూడా ఐటీడీఏ కొనుగోలు చేసి ఇచ్చేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఐటీడీఏ పీవోకు సొంత వెహికల్​లేదు. యూనిట్​ఆఫీసర్లదీ అదే పరిస్థితి. గతేడాది జనరల్ బాడీ మీటింగ్​లో కొత్త వాహనాలు కొనుగోలు చేయాలని తీర్మానం చేశారు. నేటికీ వాహనాలు కొనలేదంటే ఆర్థిక పరిస్థితి ఏంటో చేసుకోవచ్చు. 

పరిష్కారానికి నోచుకోని సమస్యలెన్నో...!

ఐటీడీఏ పరిధిలోని 32 మండలాల్లో పరిష్కారానికి నోచుకోని సమస్యలు అనేకం ఉన్నాయి. ఎనిమిది ఏకలవ్య స్కూళ్లను ఏర్పాటు చేశారు. వాటి భవన నిర్మాణాలు నాలుగేళ్లుగా కొనసాగుతున్నాయి. నిధులొచ్చినా మార్పులేదు. మీటింగ్​ ఏర్పాటు చేస్తే ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు చర్చించి పనులు పూర్తయ్యేలా చూస్తారు. వానాకాలంలో వ్యాధుల నియంత్రణలో వైద్యారోగ్యశాఖదే కీలకం. ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు లేవు. అడిషనల్ డీఎంహెచ్వో పోస్టుతోపాటు భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ప్రధాన పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఆసుపత్రిలో పరికరాలు ఉన్నా వాటిని ఆపరేట్ చేసే సిబ్బంది లేక ప్రైవేట్​కు గిరిజనులు వెళ్తున్నారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడు హక్కు పత్రాలిచ్చారు. కానీ ఇంకా పోడు సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. వీటికి రైతుబంధు సాయంలో అనేక లోపాలు ఉన్నాయి. ఓ ఇంట్లో అన్నయ్యకు ఉద్యోగం ఉంటే తమ్ముడి భూమికి రైతుబంధు నిలిపేశారు. ఇక 21 మండలాల్లో సర్వే చేసి పట్టాలివ్వకుండా ఆగిన దరఖాస్తులు 4500 పెండింగ్​లో ఉన్నాయి. సాగులో లేరని మొబైల్​యాప్​లో గిరిజనుల పేర్లు తీసేశారు. ఇలాంటి సమస్యలకు జనరల్ బాడీ మీటింగ్​లో ప్రస్తావించే అవకాశం ఉంటుంది. 

వెంటనే ఏర్పాటు చేయాలె..

గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం జనరల్ బాడీ మీటింగ్​ను తక్షణమే ఏర్పాటు చేయాలి. పల్లెలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నయ్. అభివృద్ధే లేదు. మీటింగ్​పెట్టే తీరిక కూడా ఐటీడీఏకు లేదా? తెలంగాణ ఏర్పడ్డాక ఐటీడీఏలు, వాటికి నిధులు, బడ్జెట్ విషయాన్నే కేసీఆర్​ సర్కారు మరిచిపోయింది. ఆది వాసీలపై సవతితల్లి ప్రేమ చూపిస్తోంది. 

పొదెం వీరయ్య, ఎమ్మెల్యే, భద్రాచలం

త్వరలోనే మీటింగ్​ పెడతాం..

మీటింగ్​ ఆలస్యమైన మాట నిజమే. ఈ మధ్యనే కొత్తగా కలెక్టర్, ఐటీడీఏ పీవోలు వచ్చారు. త్వరలోనే ఐటీడీఏ జనరల్ బాడీ మీటింగ్​పెడతాం. అన్ని సమస్యలు పరిష్కరించేందుకు సభ్యులకు ముందు ఉంచుతాం. మీటింగ్​నిర్వహణకు ఏర్పాట్లు చేస్తాం. 

 డేవిడ్​రాజ్, ఏపీవో జనరల్, ఐటీడీఏ