- అభ్యర్థుల తరఫున ప్రచార బరిలోకి దిగుతున్న ప్రముఖులు, బడా నేతలు
- గతంలో ఉమ్మడి జిల్లాలోని 200 వార్డుల్లో 134 బీఆర్ఎస్ ఖాతాలోకి..
- కాంగ్రెస్ కు 33, బీజేపీకి 10, మరో 23 ఇతర పార్టీలు, ఇండిపెండెంట్లకు..
- ఇప్పుడు 260లో మెజార్టీ స్థానాలను టార్గెట్ చేసిన పార్టీలు
హనుమకొండ, వెలుగు: ఓరుగల్లు మున్సిపాలిటీలపై మూడు ప్రధాన పార్టీలు ఫోకస్ పెంచాయి. ‘పంచాయతీ’ ఫలితాల తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోటీ పడుతున్నాయి. దీంతో ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ పోరు తారస్థాయికి చేరింది.
2020లో జరిగిన ఎన్నికల్లో అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అత్యధిక స్థానాలను గెలుచుకుని, చైర్మన్ పీఠాలను దక్కించుకోగా, ఇప్పుడు కాంగ్రెస్ మెజార్టీ స్థానాలను చేజిక్కించుకునేందుకు కసరత్తు చేస్తోంది. బీజేపీ కూడా తనవంతు ప్రయత్నాలు చేస్తుండగా, మూడు ప్రధాన పార్టీలు ఛాలెంజింగ్ గా తీసుకుని పోటీ పడుతున్నాయి. ఎలక్షన్ కు ఇంకో మూడు రోజులే గడువు ఉండటంతో ఆయా పార్టీలకు చెందిన బడా లీడర్లను రంగంలోకి దింపి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
2020లో అలా.. ఇప్పుడిలా..
రాష్ట్రంలో 2020 జనవరిలో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరకాల, భూపాలపల్లి, డోర్నకల్, మహబూబాబాద్, మరిపెడ, తొర్రూరు, నర్సంపేట, వర్ధన్నపేట, జనగామ 9 మున్సిపాలిటీల్లోని 200 వార్డులకు ఎన్నికలు జరగగా, అందులో మెజార్టీ స్థానాలను అప్పటి అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ కొల్లగొట్టింది.
మొత్తంగా 134 వార్డులను బీఆర్ఎస్ సొంతం చేసుకోగా, కాంగ్రెస్ 33 వార్డుల్లో విజయం సాధించింది. బీజేపీ 10, సీపీఐ 4, సీపీఎం 2, ఇతర గుర్తింపు పొందిన పార్టీలు 4, ఇండిపెండెంట్లు 13 వార్డుల్లో గెలుపొందారు. ఇదిలాఉంటే రాష్ట్ర ప్రభుత్వం కొద్దిరోజుల కింద ఏర్పాటు చేసిన కొత్త మున్సిపాలిటీలతో ఉమ్మడి జిల్లాలో వాటి సంఖ్య 12కు చేరింది.
18 వార్డులతో స్టేషన్ ఘన్ పూర్, 20 వార్డులతో ములుగు, 16 వార్డులతో కేసముద్రం మున్సిపాలిటీలను కొత్తగా ఏర్పాటు చేయడంతో పాటు నర్సంపేటలోని వార్డులను 30కి పెంచింది. దీంతో ఉమ్మడి జిల్లాలోని వార్డుల సంఖ్య 260కి చేరింది. ఇందులో మెజార్టీ స్థానాలను దక్కించుకునేందుకు మూడు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి.
ఓరుగల్లుకు బడా నేతలు.. 8న సీఎం రాక
ఇంకో మూడు రోజుల్లోనే మున్సిపల్ ఎన్నికలు జరగనుండటంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ప్రచార కార్యక్రమాలను స్పీడప్ చేశాయి. మెజార్టీ మున్సిపల్ స్థానాలను కొల్లగొట్టేందుకు ఆయా పార్టీల నుంచి ప్రముఖులను రంగంలోకి దించుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి జిల్లా మున్సిపాలిటీలపై ఫోకస్ పెంచారు.
స్థానిక ఎమ్మెల్యేలు, డీసీసీ ప్రెసిడెంట్లు కూడా నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దాంతో పాటు ఈ నెల 8న భూపాలపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఏఐసీసీ సెక్రటరీ, తెలంగాణ ఎన్నికల ఇన్చార్జి పి.విశ్వనాథన్ కూడా మున్సిపాలిటీ ప్రచారాల్లో పాల్గొంటున్నారు. బీఆర్ఎస్ నుంచి పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు ప్రచారాలు నిర్వహిస్తున్నారు.
బీజేపీ తరఫున జనసేన అధినేత పవన్ కల్యాన్ కూడా ఓరుగల్లు పర్యటనకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ప్రధాన పార్టీల తరఫున ప్రముఖ నాయకులు ప్రచార బరిలోకి దిగడంతో మున్సిపల్ ఎలక్షన్స్ పై సర్వత్రా ఉత్కంఠ కనిపిస్తోంది. ఈ నెల 11న మున్సిపల్ ఎలక్షన్ జరగనుండగా ప్రముఖుల పర్యటనలు ఎవరికి ఎలాంటి ఫలితాలనిస్తాయో చూడాలి.
ఫోకస్ పెంచిన పార్టీలు..
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 260 వార్డుల్లో మెజార్టీ స్థానాలను దక్కించుకునేందుకు మూడు ప్రధాన పార్టీలు హోరాహోరీ తలపడుతున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే కనిపిస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉండటం, పంచాయతీ ఎన్నికల్లోనూ పాజిటివ్ ఫలితాలు రావడంతో మున్సిపల్ ఎలక్షన్స్ రేస్ లో కాంగ్రెస్ స్పీడ్ పెంచింది.
.ఎక్కడికక్కడ ఇన్చార్జిలను నియమించి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. గత పదేండ్ల పాటు మున్సిపాలిటీల్లో ఉన్న బలంతో బీఆర్ఎస్ కూడా గట్టిపోటీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. గతంతో పోలిస్తే కొన్నిచోట్ల అర్బన్ ఓటు బ్యాంక్ పెరగడంతో బీజేపీ కూడా తనవంతు ప్రయత్నాలు చేస్తోంది.
