నైపుణ్యాభి వృద్ధి కేంద్రాలు గా ఐటీఐలు : మంత్రి వివేక్ వెంకటస్వామి

నైపుణ్యాభి వృద్ధి కేంద్రాలు గా ఐటీఐలు : మంత్రి వివేక్ వెంకటస్వామి
  •     శిక్షణ, మౌలిక వసతులను ఆధునీకరిస్తున్నాం: వివేక్ వెంకటస్వామి 
  •     కన్హ శాంతి వనంలో ‘ఇండియా స్కిల్స్ కాంపిటీషన్’ ముగింపు 
  •     విద్యార్థులకు మెడల్స్ అందజేసిన కార్మిక శాఖ మంత్రి 

షాద్ నగర్, వెలుగు: రాష్ట్రంలో ఐటీఐలు, శిక్షణా మౌలిక వసతులను ఆధునీకరించడానికి కృషి చేస్తున్నామని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రభుత్వ ఐటీఐలను ఆధునిక స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లుగా మారుస్తున్నామని చెప్పారు. ఆధునిక యంత్రాలు, డిజిటల్ పరికరాలు, పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన పాఠ్య ప్రణాళికలు అందిస్తున్నామని వెల్లడించారు. 

మంగళవారం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ శాంతి వనంలో ఇండియా స్కిల్స్ కాంపిటీషన్ 2025-–2026 ముగింపు కార్యక్రమానికి మంత్రి వివేక్ వెంకట స్వామి, ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ డైరెక్టర్ క్రాంతి వెస్లీ చీఫ్ గెస్టులుగా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా 3డీ డిజిటల్, యాడిటివ్ మాన్యుఫ్యాక్చరింగ్, ఆటోనామస్ మొబైల్ రోబోటిక్, బ్యూటీథెరపీ, బ్రిక్ లేయింగ్, కేబినెట్ మేకింగ్, కార్పెంటరీ రంగాలలో స్కిల్స్ కాంపిటీషన్ లో గెలిచిన విద్యార్థులకు మెడల్స్ అందజేశారు. అనంతరం మంత్రి వివేక్ మాట్లాడుతూ.. సౌత్ ఇండియా పోటీలు మొత్తం 63 నైపుణ్య విభాగాల్లో జరిగాయని.. తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, ఏపీకి చెందిన 350కి పైగా  పోటీదారులు ప్రతిభను ప్రదర్శించారని తెలిపారు. 

ముఖ్యంగా పురుషాధిక్యంగా భావించే కేబినెట్ మేకింగ్, కార్పెంట్రీ, ఎలక్ట్రికల్ ఇన్‌స్టాలేషన్స్, ప్లంబింగ్, హీటింగ్ వంటి రంగాల్లో 20 మంది మహిళలు పోటీ పడడం సామాజిక మార్పుకు నిదర్శనమన్నారు. హైదరాబాద్ ఇప్పటికే ఐటీ, ఫార్మాస్యూటికల్స్, ఏరోస్పేస్, లైఫ్ సైన్సెస్ రంగాలలో గ్లోబల్ కేంద్రంగా ఉందని.. అందుకే ఏఐ రోబోటిక్స్, మెచాట్రానిక్స్, డేటా అనలిటిక్స్, గ్రీన్ టెక్నాలజీస్ వంటి రంగాల అభివృద్ధిపై దృష్టి పెడుతున్నామని తెలిపారు.