ఐటీపీ ఏరో ప్లాంటుకు భూమిపూజ..వచ్చే ఏడాది అందుబాటులోకి

ఐటీపీ ఏరో ప్లాంటుకు భూమిపూజ..వచ్చే ఏడాది అందుబాటులోకి

హైదరాబాద్​, వెలుగు: విమాన ఇంజన్లు, విడిభాగాలను తయారు చేసే ఐటీపీ ఏరో హైదరాబాద్‌లో మరో ప్లాంటు కోసం మంగళవారం భూమి పూజ నిర్వహించింది. 2027 నాటికి అందుబాటులోకి వచ్చే ఈ కొత్త కేంద్రం ద్వారా 350 మందికి పైగా ఉపాధి లభిస్తుంది. ఇప్పటికే ఉన్న 250 మంది ఉద్యోగులకు వీరు అదనంగా తోడవుతారు. విమాన ఇంజిన్ భాగాల తయారీపై ఈ సంస్థ దృష్టి సారిస్తుంది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 తెలంగాణ ఏరోస్పేస్ రంగానికి ఇది గర్వకారణమని పేర్కొన్నారు. ఐటీపీ ఏరో ఇండియా ఎండీగా సందీప్ శర్మ వ్యవహరిస్తున్నారు. 2025లో ఈ కంపెనీ 1.88 బిలియన్ యూరోలు (రూ.16.9 వేల కోట్లు) ఆదాయాన్ని సాధించింది. ఇబిటా 379 మిలియన్ యూరోలు (రూ.4,226 కోట్లు) గా నమోదైంది. 2030 నాటికి పరిశోధన, అభివృద్ధి రంగాల్లో 1.2 బిలియన్ యూరోలు (రూ.10,800 కోట్లు) పెట్టుబడి పెట్టాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. అంతర్జాతీయ విమానయాన రంగంలో పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా హైదరాబాద్ కేంద్రం కీలక పాత్ర పోషించనుందని ఐటీపీ ఏరో తెలిపింది.