పీవీ జీవితంలో అదొక్క‌టే దురదృష్టకర సంఘటన

పీవీ జీవితంలో అదొక్క‌టే దురదృష్టకర సంఘటన

జగిత్యాల జిల్లా: పీవీ నరసింహారావు దేశం గర్వపడే వ్యక్తి అని అన్నారు ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి. ఆదివారం జ‌గిత్యాల జిల్లాలోని త‌న నివాసంలో మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు జయంతి వేడుకలు నిర్వ‌హించారు జీవన్ రెడ్డి . ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. పీవీ జీవితంలో ఒకటే దురదృష్టకర సంఘటన బాబ్రీ మసీదు కూల్చివేత అని చెప్పారు. ఆనాడు బాబ్రీ మసీదు నిర్మాణాన్ని తొలగించాలని కుట్ర జరిగింద‌ని, ఆ కుట్రను ఛేదించడంలో పీవీ వైఫల్యం అయ్యార‌ని చెప్పారు. ఆయన జీవితంపై అది చెరిపివేయలేని ముద్ర అని అన్నారు. ఇదే విష‌యంపై ఆనాడు కాంగ్రెస్ పార్టీపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు వచ్చాయని చెప్పారు. లౌకిక వాదానికి కట్టుబడి ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈ బాబ్రీ మసీదు నిర్మాణం తొలగింపు… కాంగ్రెస్ పార్టీకి, వ్యక్తిగతంగా పీవీ నరసింహారావుకు మచ్చను తెచ్చిపెట్టాయని జీవ‌న్ రెడ్డి అన్నారు

మాజీ ప్ర‌ధాని రాజీవ్ గాంధీ హఠాన్మరణం చెందిన స‌మ‌యంలో పీవీని ఐక్యత కాపాడే వ్యక్తిగా భావించి.. దేశ ప్రధానిగా సోనియా గాంధీ పీవీ నరసింహారావు ను సూచించార‌ని చెప్పా‌రు. ఐదు సంవత్సరాల పాలనలో పీవీ దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేశార‌ని చెప్పారు. పీవీ నరసింహారావు ఉన్నత కుటుంబంలో జన్మించినా.. దేశ స్వతంత్ర కోసం, హైదరాబాద్ స్వతంత్ర కోసం పోరాడని చెప్పారు. ఆయన వివిధ హోదాలు బాధ్యతగా నిర్వహించి ప్రతి హోదాలో గుర్తింపు పొందారన్నారు. ఇందిరాగాంధీకి అతివిశ్వసమైన వ్యక్తి పీవీ నరసింహారావు అని జీవ‌న్ అన్నారు.