మనీలాండరింగ్‌ కేసులో జాక్వెలిన్‌కు ఊరట

మనీలాండరింగ్‌ కేసులో జాక్వెలిన్‌కు ఊరట

న్యూఢిల్లీ: మనీలాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ యాక్టర్​ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్​ కు కోర్టులో ఊరట దక్కింది. ఈ కేసుకు సంబంధించి జాక్వెలిన్‌కు కోర్టు గతంలో మధ్యంతర బెయిల్​ ఇచ్చింది. ఈ బెయిల్​ గడువు పూర్తికావొస్తుండడంతో ఆమె మరోసారి కోర్టును ఆశ్రయించారు. దీంతో మధ్యంతర బెయిల్​ గడువును ఢిల్లీలోని పాటియాలా హౌస్‌కోర్టు పొడిగించింది. జాక్వెలిన్‌ తాత్కాలిక బెయిల్‌ గడువును నవంబర్‌ 10 వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది.

ప్రస్తుతం తాత్కాలిక బెయిల్‌పై ఉన్న జాక్వెలిన్.. తన రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ కోసం లాయర్‌ ప్రశాంత్‌ పాటిల్‌తో కలిసి కోర్టుకు హాజరయ్యారు. జాక్వెలిన్‌ రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌ కూడా నవంబర్‌ 10న విచారించనున్నట్లు పాటియాలా హౌస్‌కోర్టు తెలిపింది. దాదాపు రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడైన సుఖేశ్‌ చంద్రశేఖర్‌ నుంచి కోట్ల రూపాయల విలువైన వస్తువులను బహుమతులుగా జాక్వెలిన్‌ అందుకున్నట్లు ఈడీ విచారణలో తేలింది. తాత్కాలిక బెయిల్‌పై ఉన్న జాక్వెలిన్‌ ఈ కేసులో అరెస్ట్‌  కాకుండా ఉండేందుకు రెగ్యులర్‌ బెయిల్‌ కోసం ప్రయత్నిస్తున్నారు.