
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ షెట్టర్ తిరిగి బీజేపీలో చేరారు. లింగాయత్ వర్గానికి చెందిన షెట్టర్ కు బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఆయన ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. తిరిగి ఏడు నెలల తర్వాత మళ్లీ బీజేపీలో చేరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ సమక్షంలో 2024 జనవరి 25వ తేదీన షెట్టర్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ పై హుబ్లీ ధార్వాడ్ సెంట్రల్ స్థానం నుంచి పోటీ చేసిన షెట్టర్ .. బీజేపీ అభ్యర్థి మహేశ్ తెంగినకై పై 34 వేల 289 ఓట్లతో ఓడిపోయారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఈసారి ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు.
జగదీష్ షెట్టర్ 2012 నుంచి 2013 మధ్య 10 నెలల పాటు కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు. కర్ణాటకలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, ప్రతిపక్ష నేతతో సహా వివిధ పదవులను కూడా నిర్వహించారు. 2008లో కర్ణాటకలో బీజేపీ తొలిసారిగా అధికారంలోకి వచ్చినప్పుడు అసెంబ్లీ స్పీకర్‌గా కూడా పనిచేశారు.