జగ్గారెడ్డి జంప్! .. ఆగస్టు 23న బీఆర్​ఎస్​లోకి.. కేసీఆర్ సమక్షంలో చేరిక

జగ్గారెడ్డి జంప్! .. ఆగస్టు 23న బీఆర్​ఎస్​లోకి.. కేసీఆర్ సమక్షంలో చేరిక

సంగారెడ్డి, వెలుగు:  సంగారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్​ నేత తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) బీఆర్ఎస్​లో చేరడం దాదాపు ఖాయమైంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పొసగని జగ్గారెడ్డి.. కొంతకాలంగా బీఆర్ఎస్​లో చేరేందుకు గ్రౌండ్  ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే బుధ, గురువారాల్లో అనుచరులకు ఫోన్లు చేసి మద్దతు కోరారు. అంతా అనుకున్నట్టు జరిగితే ఈ నెల 23న సీఎం కేసీఆర్​ పర్యటన సందర్భంగా మెదక్​ వేదికగా జగ్గారెడ్డి బీఆర్ఎస్ ​ కండువా కప్పుకుంటారని ఆయన అనుచరులు చెబుతున్నారు. కొంతకాలంగా రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే జగ్గారెడ్డికి పడటం లేదు. 

రేవంత్ ​ప్రెసిడెంట్ అయ్యాక సీనియర్లను కావాలనే పక్కనపెడ్తున్నారని, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటైన తనకు గౌరవం ఇవ్వడం లేదని పలుమార్లు ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కొంతకాలంగా గాంధీ భవన్​కు దూరంగా ఉంటున్నారు. ‘‘ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండడం వల్లే సంగారెడ్డిలో డెవలప్​మెంట్ పనులు చేయలేకపోయాను. అధికార పక్షంలో ఉంటే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే అవకాశం ఉండేది” అని జగ్గారెడ్డి తన అనుచరుల వద్ద తరచూ అన్నట్టు తెలిసింది. కాంగ్రెస్​లో సరైన గుర్తింపు లేకపోవడం, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం కాకపోవడంతోనే ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకుంటున్నట్టు అనుచరులు చెబుతున్నారు.  

చింత ప్రభాకర్ కు ఎమ్మెల్సీ పదవి?

మాజీ ఎమ్మెల్యే, చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింత ప్రభాకర్ సంగారెడ్డి నుంచి బీఆర్ఎస్ టికెట్​ఆశిస్తున్నారు. ఇన్ని రోజులు టికెట్​తనదే అనే ధీమాతో నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాలు చూస్తూ వచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి జగ్గారెడ్డిని చేర్చుకుని టికెట్ ఇస్తే, తన పరిస్థితి ఏమిటని ప్రభాకర్ ఆందోళనలో ఉన్నారు. రెండు నెలల కింద కంది, కొండాపూర్, సదాశివపేట, సంగారెడ్డి మండలాలకు చెందిన బీఆర్ఎస్ లీడర్లు, చింత ప్రభాకర్ అనుచరులు రహస్య మీటింగ్ పెట్టుకుని జగ్గారెడ్డి రాకను వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించారు. జగ్గారెడ్డిని చేర్చుకుంటే తామంతా ముకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని అప్పట్లో హైకమాండ్​ను హెచ్చరించారు. తాజాగా ఈ నెల 23న జగ్గారెడ్డి బీఆర్ఎస్​లో చేరుతారనే సమాచారంతో గురువారం నుంచే ఆ పార్టీ నేతలు సోషల్​ మీడియాలో ఆయన రాకను వ్యతిరేకిస్తూ పోస్టులు పెడ్తున్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న చింతకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని హైకమాండ్ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిందని, ఈ క్రమంలోనే జగ్గారెడ్డికి లైన్​ క్లియర్ చేసిందని బీఆర్ఎస్ ముఖ్య నేత ఒకరు చెప్పారు. 

హరీశ్ దగ్గరికి చింత అనుచరులు.. 

జగ్గారెడ్డి రాకను వ్యతిరేకిస్తూ సంగారెడ్డి బీఆర్ఎస్ నేతలు, చింత ప్రభాకర్ అనుచరులు 500 మంది గురువారం సాయంత్రం ప్రత్యేక వాహనాల్లో హైదరాబాద్​లోని మంత్రి హరీశ్​రావు క్యాంప్ ఆఫీసుకు వెళ్లి, కలిశారు. జగ్గారెడ్డిని పార్టీలోకి రానీయొద్దని కొందరు కన్నీళ్లు పెట్టుకోగా, పార్టీలోకి జగ్గారెడ్డి వస్తే తాము కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని మరికొందరు హెచ్చరించినట్టు తెలిసింది. దీంతో ‘‘ఎవరూ అధైర్య పడొద్దు. నేను సీఎంతో అన్ని విషయాలు మాట్లాడుతాను’ అని హరీశ్ హామీ ఇచ్చినట్టు చింత అనుచరులు పేర్కొన్నారు. పార్టీ హైకమాండ్ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని, ఎవరికీ అన్యాయం జరగనివ్వనని మంత్రి చెప్పడంతో నాయకులు తిరిగి సంగారెడ్డికి వచ్చారు.