ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకూ కటాఫ్ ప్రకటించాలి : జగ్గారెడ్డి

ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకూ కటాఫ్ ప్రకటించాలి : జగ్గారెడ్డి

కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షలలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్,  ఎమ్మెల్యే  జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. 15వేల మంది ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చినట్లుగా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కూడా కటాఫ్ మార్కులను ప్రకటించాలన్నారు.  గాంధీ భవన్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఎస్సీ, ఎస్టీలకు  40, బీసీలకు 50, ఓసీలకు 60 మార్కులు కటాఫ్ ఇచ్చారని..  ఈడబ్ల్యూఎస్ వాళ్లకు 50 మార్కులు కటాఫ్  గా ప్రకటించాలని జగ్గారెడ్డి  కోరారు. ఇప్పటికే ఈ అంశాన్ని అసెంబ్లీ సమావేశాల్లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క లేవనెత్తారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ, కేటీఆర్, హోం మంత్రి వెంటనే దీనిపై స్పందించాలని విజ్ఞప్తి చేశారు.

దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఈరోజే లేఖ రాస్తున్నానని జగ్గారెడ్డి వెల్లడించారు. ప్రభుత్వం స్పందించకపోతే ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఈడబ్ల్యూఎస్ విద్యార్థుల పక్షాన ఆందోళన చేపడుతామన్నారు.