కూలడానికి కాంగ్రెస్​ సర్కారేమన్న కాళేశ్వరం ప్రాజెక్టా?: జగ్గారెడ్డి

కూలడానికి కాంగ్రెస్​ సర్కారేమన్న  కాళేశ్వరం ప్రాజెక్టా?: జగ్గారెడ్డి
  •  
  • మా పార్టీది 130 ఏండ్ల చరిత్ర: పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

హైదరాబాద్​, వెలుగు : కూల్చే ప్రయత్నం చేస్తే కూలడానికి కాంగ్రెస్​ సర్కారు ఏమైనా కాళేశ్వరం ప్రాజెక్టా అని పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్  జగ్గారెడ్డి అన్నారు. నాసిరకం సిమెంట్​తో ప్రాజెక్టులు కట్టినట్టు కాదని, తమ పార్టీకి 130 ఏండ్ల చరిత్ర​ఉందని ఆయన పేర్కొన్నారు. అంతర్యుద్ధం తమ పార్టీలో లేదని, బీఆర్ఎస్​ పార్టీలోనే కుమ్ములాటలు జరుగుతున్నాయని చెప్పారు. కేసీఆర్​ను వెనుక నుంచి గడ్డపారతో పొడిచేందుకు హరీశ్​ సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. గురువారం గాంధీ భవన్​లో మీడియాతో జగ్గారెడ్డి మాట్లాడారు. ‘‘కేసీఆర్  తోపు అని బీఆర్ఎస్​ వాళ్లు అంటున్నరు. అలాంటి తోపు ఎందుకు తుస్సయ్యాడు? కామారెడ్డిలో ఎందుకు ఓడిపోయిండు? వాటికి ప్రశాంత్​ రెడ్డి సమాధానం చెప్పాలి. ఎక్కువ మాట్లాడితే అన్నీ బయటకు తీస్తం. బీఆర్ఎస్​ హయాంలో ఎమ్మెల్యేలు సీఎంను కలిసేవారా?  కేటీఆర్, హరీశ్​ను మాత్రమే కలిసేవారు”  అని జగ్గా రెడ్డి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్  ఎమ్మెల్యేలు తమ దగ్గరకి వస్తే సీఎంను కలిసే అవకాశం ఉంటుందన్నారు. మల్లారెడ్డి కూడా తమ దగ్గరకు రావొచ్చని సూచించారు. 

హరీశ్​ బ్లాక్ మనీపై సీఎంకు చెప్త

హరీశ్​ రావు దగ్గర కాళేశ్వరం డబ్బులు ఉన్నాయని, రూ.60 కోట్లు పంచి బీఆర్ఎస్​ అభ్యర్థిని గెలిపించారని జగ్గారెడ్డి ఆరోపించారు. తన దగ్గరే అన్ని డబ్బులుంటే పట్టపగలే చుక్కలు చూపించేవాడినన్నారు. హరీశ్​ నల్లధనం ఎక్కడ దాచారో సీఎంకు చెప్తానని తెలిపారు. తాను కాంగ్రెస్​కు ఆయుధమని, అలాంటి ఆయుధమైన తనకు పదవులు అక్కర్లేదని చెప్పారు. సంగారెడ్డిలో జరిగే కార్యక్రమాల్లో ప్రొటోకాల్​ పాటించడం లేదంటున్నారని, బీఆర్ఎస్​ నేర్పిన రాజకీయాన్నే తామూ ఫాలో అవుతున్నామని చెప్పారు.