జగిత్యాల టౌన్, వెలుగు: పార్టీలో కార్యకర్తలకు న్యాయం జరగడం లేదంటూ రాజీనామా చేసిన జీవన్ రెడ్డి తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎంతమంది కార్యకర్తలకు పదవులు ఇప్పించారో చెప్పాలని డీసీసీ అధ్యక్షుడు నందయ్య ప్రశ్నించారు. జీవన్ రెడ్డి శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన విమర్శలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా జగిత్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నందయ్య మాట్లాడుతూ.. జీవన్ రెడ్డి ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో జగిత్యాల కార్యకర్తలను గాంధీభవన్ దాకా కూడా వెళ్లనివ్వలేదని విమర్శించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయనకు మంత్రి పదవి ఇచ్చి ఉంటే పార్టీని వదిలిపెట్టేవారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ పదవి రెన్యూవల్ చేయలేదనే కారణంతోనే సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం రిలీఫ్ ఫండ్ లాగిన్ బాధ్యతను ఇచ్చి పార్టీ జీవన్ రెడ్డిని గౌరవించిందని, ఓడిపోయిన నేతల్లో ఎవరికీ ఆ అవకాశం ఇవ్వలేదని గుర్తు చేశారు. ఈ సమావేశంలో జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి, కార్యకర్తలు పాల్గొన్నారు.
