పెగడపల్లి, వెలుగు: ముభావంగా ఉన్న విద్యార్థినిని టీచర్ ‘మైసమ్మవా, దయ్యానివా, నీకేం కావాలి? అంటూ అని అడగడంతో అక్కడ ఉన్న విద్యార్థులు భయాంతోళనకు గురైన వీడియో జగిత్యాల జిల్లాలో వైరల్గా మారింది. వివరాల్లోకి వెళ్తే పెగడపల్లి కేజీబీవీలో విద్యార్థిని ఒంటరిగా ఏడుస్తుండటంతో ఆమెను పిలిచిన టీచర్ పై విధంగా ప్రశ్నించారు. పాఠశాలలో ఏటా నిర్వహించే మైసమ్మ పూజ జరగకపోవడమే కారణమా అన్నట్లుగా ప్రశ్నించినట్లు వీడియోలో కనిపిస్తోంది. విద్యార్థిని ఆందోళనకు కారణాలు తెలుసుకొని తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాల్సింది పోయి, దేవతలు, దయ్యాల ప్రస్తావన తీసుకురావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు, విద్యార్థినితో మాట్లాడుతూనే మరో విద్యార్థినితో జడ వేయించుకోవడంపైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన నాలుగు రోజుల కింద జరిగినట్లు తెలుస్తుండగా, వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై టీచర్ స్పందిస్తూ విద్యార్థినికి ధైర్యం చెప్పేందుకే అలా మాట్లాడానని, అనారోగ్య సమస్యతోపాటు చేతినొప్పి కారణంగా మరో విద్యార్థినితో జడ వేయించుకున్నానని తెలిపారు. ఘటనపై ఆఫీసర్లు విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని పలువురు కోరుతున్నారు.
