హుజురాబాద్, వెలుగు : ఝీరంఘాటీ ఘటనలో ఆదివాసీలకు ఛత్తీస్ గఢ్ ఎన్ఐఏ కోర్టు విధించిన ఉరి శిక్షను రద్దు చేయాలని మానవ హక్కుల వేదిక జాతీయ నేత ఎస్. జీవన్ కుమార్ డిమాండ్ చేశారు. వారు ఇప్పటికే 13 ఏండ్లు జైలు జీవితం గడిపారని గుర్తు చేశారు.
హక్కుల నేత బాలగోపాల్ 17వ వర్ధంతి సభను మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎస్. తిరుపతయ్య అధ్యక్షతన ఆదివారం హుజూరాబాద్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్ కుమార్ మాట్లాడుతూ బాలగోపాల్ మూడున్నర దశాబ్దాల పాటు హక్కుల రంగంలో సేవలు అందించారని గుర్తు చేశారు. సీఆర్పీసీకి సవరణ చేసి మరణ శిక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కోట్ల మంది ఓటు హక్కును రద్దు చేస్తున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ చేత రాజీనామా చేయించాలని సభలో తీర్మానించారు.
జంతర్ మంతర్ వద్ద నిరసన తెలియజేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ, ఇతర నిరసనకారులపై కేంద్రం అమలు చేస్తున్న నిర్బంధాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అంబటి నాగయ్య, టీజేఎస్ రాష్ట్ర నాయకులు, న్యాయవాది ముక్కెర రాజు, ఆవునూరి సమ్మయ్య, హేతువాద సంఘం నాయకురాలు రమాదేవి, హుజురాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కాయిత రాములు, బండ శ్రీనివాస్, వర్దినేని రవీందర్ రావు, జీడి సారయ్య, సామ్రాజ్యం పాల్గొన్నారు.
