జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల పట్టణ సమగ్రాభివృద్ధే తమ లక్ష్యమని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం చైర్‌పర్సన్ సమిండ్ల వాణి అధ్యక్షతన జూలై నెల మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే సంజయ్ చీఫ్‌గెస్ట్‌గా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99రోజుల కార్యాచరణలో భాగంగా జగిత్యాల మున్సిపాలిటీ నిర్వహించిన స్వచ్ఛ భారత్ అవగాహన సదస్సులకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం గర్వకారణమని ప్రశంసించారు.
పాలకవర్గ సభ్యులు, అధికారులు పార్టీలకు అతీతంగా సమిష్టిగా పనిచేస్తూ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. పట్టణాన్ని ఆనుకుని ఉన్న చెరువులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. చైర్‌పర్సన్ వాణి మాట్లాడుతూ జగిత్యాల పట్టణంలో మెరుగైన మౌలిక వసతుల కల్పనకు రూ. 6.13 కోట్ల అంచనా వ్యయంతో పలు అభివృద్ధి పనుల ప్రతిపాదనలకు కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందని ప్రకటించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సత్య ప్రణవ్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, అధికారులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
