పక్కాగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌ కుమార్‌

పక్కాగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌ కుమార్‌

జగిత్యాల టౌన్, వెలుగు: యాసంగి ధాన్యం కొనుగోలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల కలెక్టరేట్‌‌‌‌లో బుధవారం ఉన్నత స్థాయి రివ్యూ మీటింగ్‌‌‌‌ నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాసంగి ధాన్యం కొనుగోలుపై రైస్ మిల్లర్లు, ట్రాన్స్​పోర్ట్‌‌‌‌ అధికారులతో రివ్యూ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో దాదాపు 4,83,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని, ఇందుకోసం 435 కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేసినట్లు చెప్పారు. మిల్లర్ల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని నిబంధనల ప్రకారం వేగంగా కొనుగోలు చేయాలని సూచించారు. అనంతరం వయోవృద్ధుల సంక్షేమం, భద్రతే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిపాదించిన ‘తెలంగాణ ఉద్యోగులు– తల్లిదండ్రుల పరిరక్షణ, పర్యవేక్షణ బిల్లు 2026’పై వయోవృద్ధులతో ప్రత్యేకంగా చర్చించారు. తల్లిదండ్రుల సంరక్షణలో నిర్లక్ష్యం వహించే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, ప్రజాప్రతినిధులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అడిషనల్  కలెక్టర్లు లత, రాజగౌడ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ దినేష్, మున్సిపల్ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌ సమిండ్ల వాణి, జిల్లా సంక్షేమ అధికారి రాజ్ కుమార్, రైస్ మిల్లర్ల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.