
వరస విషాదాలు.. అమెరికాలో హైదరాబాద్ స్టూడెంట్ హత్య జరిగిన ఘటన బయటకు వచ్చిన వెంటనే.. మరో విషాధ వార్త వెలుగులోకి వచ్చింది. పీజీ చదివేందుకు రెండేళ్ల క్రితం లండన్ వెళ్లిన 25 ఏళ్ల మహేందర్ రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం దమ్మన్నపేటకు చెందిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏనుగు రమేష్ పెద్ద కుమారుడే ఈ మహేందర్ రెడ్డి.
2025, అక్టోబర్ 3వ తేదీ రాత్రి లండన్ లోని తన నివాసం ఉండగా.. అనారోగ్యానికి గురయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా గుండెపోటుగా చెప్పారు డాక్టర్లు. ఆస్పత్రిలో చికిత్స చేస్తున్న సమయంలో చనిపోయినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం వచ్చింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివేందుకు రెండేళ్ల క్రితం లండన్ వెళ్లాడు మహేందర్ రెడ్డి.
కుమారుడు చనిపోయిన విషయం తెలిసి షాక్ అయ్యారు పేరంట్స్. ఎంతో భవిష్యత్ ఉన్న కుమారుడికి ఇలా జరగటాన్ని జీర్ణించుకోలేకుండా ఉన్నారు. మృతదేహం రావటానికి వారం రోజులు పడుతుందని.. లండన్ నుంచి సమాచారం వచ్చినట్లు చెబుతున్నారు బంధువులు.