
జైపూర్,వెలుగు: మంచిర్యాల జిల్లాలోని జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ మరో అవార్డు అందుకుంది. న్యూఢిల్లీలోని రాడిసన్ బ్లూ హోటల్లో గ్రీన్ టెక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన 24వ వేడుకల్లో ఎస్టీపీపీ ఈడీ సీహెచ్ చిరంజీవి, డీజీఎం ఎం వాసుదేవ మూర్తికి గ్లోబల్ గ్రీన్ టెక్ ఎన్విరాన్ మెంట్ అండ్ సస్టైనబిలిటీ– 2025 అవార్డును ఫౌండేషన్ చైర్మన్ సీఈవో కమలేశ్వర్ శరన్ అందించారు.
అనంతరం ఎస్టీపీపీ ఈడీ చిరంజీవి, డీజీఎం శ్రీనివాసులు మాట్లాడుతూ.. ప్రస్తుత అవార్డుతో ఇప్పటివరకు సంస్థ వివిధ కేటగిరీల్లో 50 అవార్డులు సాధించిందని పేర్కొన్నారు. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ లో కాలుష్యాన్ని అరికట్టేందుకు వినియోగించే టెక్నాలజీ చర్యలకు అవార్డు దక్కిందని తెలిపారు.
సింగరేణి సంస్థ సీఎండీ ఎన్.బలరాం చొరవతో శుక్రవారం అవార్డును అందుకున్నామని చెప్పారు. పవర్ ప్లాంట్ లో ప్రత్యేక శ్రద్ధ తో అతి తక్కువ కాలంలో 50 అవార్డులు సాధించడం గొప్ప విషయమని డైరెక్టర్(ఈ అండ్ ఎం) సత్యనారాయణ తెలిపారు.