గంగానది శుద్ధి.. ఎన్నికల జుమ్లాగా మారింది : జైరాం రమేశ్

గంగానది శుద్ధి.. ఎన్నికల జుమ్లాగా మారింది : జైరాం రమేశ్
  •  11 ఏండ్లు గడిచినా మోదీ హామీని నెరవేర్చలేదు: జైరాం రమేశ్

న్యూఢిల్లీ: గంగానదిని శుభ్రపరిచే హామీ ఎన్నికల జుమ్లాగా మారిందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. 11 ఏండ్లు గడిచినా నేటికీ  కేంద్రం, బిహార్ ప్రభుత్వం గంగానదిని శుభ్రపరిచే హామీని నెరవేర్చలేదని ఆరోపించింది. గంగానది గతంలో కంటే ఎక్కువగా కలుషితమైందని, నది నుంచి కాలుష్య రకాలను తొలగించే  ప్రక్రియ మాత్రం మొదలు కాలేదని కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జ్ సెక్రటరీ జైరాం రమేశ్ పేర్కొన్నారు. ‘‘గంగా నది శుద్ధి కోసం ప్రకటించిన చాలా పథకాలు అవినీతికి కేంద్రంగా మారాయి. 

శంకుస్థాపన, ప్రారంభోత్సవం, భారీ ప్రచారం తప్ప ఎలాంటి పని కనిపించడం లేదు’’ ఆయన శుక్రవారం ఎక్స్ లో విమర్శించారు. ‘‘ప్రకటనలను ఇష్టపడే ప్రధాని మరోసారి బిహార్ పర్యటనలో ఉన్నారు. ప్రధాన మంత్రి ఎన్ని నకిలీ ప్రకటనలు చేసినా, ఉచిత ప్రకటనల కోసం ఎన్ని రిబ్బన్లు కత్తిరించినా, బిహార్‌లోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం సామాన్య ప్రజల అంచనాలను అందుకోవడంలో పూర్తిగా విఫలమైందనేది నిజం" అని రమేశ్ పేర్కొన్నారు.