క‌శ్మీర్‌లో ఎన్‌కౌంట‌ర్‌.. పుల్వామా అటాక్ కుట్ర‌దారుడు హ‌తం

క‌శ్మీర్‌లో ఎన్‌కౌంట‌ర్‌.. పుల్వామా అటాక్ కుట్ర‌దారుడు హ‌తం

శ్రీన‌గ‌ర్: జ‌మ్ము క‌శ్మీర్‌లోని అవంతిపురాలో శ‌నివారం ఉద‌యం జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌య్యారు. అందులో ఒక‌డు జైషే మ‌హ్మ‌ద్ ఉగ్ర‌వాద సంస్థ సౌత్ క‌శ్మీర్ ఆప‌రేష‌న్స్ క‌మాండ‌ర్ అయిన పాకిస్థానీ మొహ‌ద్ ఇస్మాల్ అల్వీ అలియాస్ సైఫుల్లా అలియాస్ అద్నాన్ అలియాస్ లంబూ అని క‌శ్మీర్ పోలీసులు ప్ర‌క‌టించారు. జైషే మ‌హ్మ‌ద్ ఉగ్ర సంస్థ చీఫ్ మ‌సూద్ అజార్ కుటుంబంలోని వాడే ఈ లంబూ. మ‌సూద్‌కు లంబూ మేన‌ల్లుడు అవుతాడ‌ని తెలుస్తోంది. ఈ ఎన్‌కౌంట‌ర్‌లో లంబూ హ‌త‌మ‌వ్వ‌డం  భార‌త ఆర్మీ, క‌శ్మీర్ పోలీసులు క‌లిసి సాధించిన పెద్ద విజ‌యం. 2019 ఫిబ్ర‌వ‌రి 14న పుల్వామాలో సీఆర్పీఎఫ్ జ‌వాన్లు వెళ్తున్న కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడికి పాల్ప‌డి 40 మంది జ‌వాన్ల మృతికి కార‌ణ‌మైన ఘ‌ట‌న వెనుక కీల‌క కుట్ర‌దారుల్లో లంబూ కూడా ఒక‌డు. ఎన్‌కౌంట‌ర్‌లో వీడిని హ‌త‌మార్చ‌డం రెండు ర‌కాలుగా ప్ల‌స్ అని చినార్ కార్ప్స్ క‌మాండ‌ర్ లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ డీపీ పాండే అన్నారు. పుల్వామా అటాక్ నిందితుడిని మ‌ట్టుబెట్ట‌డం ఒకటైతే, ఆ దాడిలో ఆత్మాహుతికి పాల్ప‌డిన ఆదిల్ అనే యువ‌కుడిని రిక్రూట్ చేసుకుని సూసైడ్ బాంబింగ్‌కు రెడీ చేసింది కూడా లంబూనే అని పాండే చెప్పారు. ఈ లంబూ క‌శ్మీర్‌లో యువ‌కుల‌ను బ్రెయిన్ వాష్ చేసి ట్రెరిజం వైపు అట్రాక్ట్ చేసేవాడ‌ని, ఐఈడీ బాంబు త‌యారు చేయ‌డంపై శిక్ష‌ణ ఇచ్చేవాడ‌ని, అలాగే భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌పై దాడుల‌కు శిక్ష‌ణ ఇచ్చేవాడ‌ని తెలిపారు. ఈ ఎన్‌కౌంట‌ర్‌తో ఒక ఉగ్ర‌వాదిని హ‌త‌మార్చ‌డంతో పాటు ఉగ్ర‌వాదాన్ని వ్యాప్తి చేసే చీడ‌పురుగును కూడా మ‌ట్టుబెట్టిన‌ట్ట‌యింద‌ని పాండే అన్నారు.

పుల్వామా అటాక్ నిందితుల్లో ఒక‌డైన‌ మ‌సూద్ అజార్ బంధువు లంబూను ఎన్‌కౌంట‌ర్‌లో మ‌ట్టుబెట్ట‌డంపై మ‌న ఆర్మీకి, అవంతిపొరా పోలీసుల‌కు క‌శ్మీర్ ఐజీ విజ‌య్ కుమార్ కంగ్రాట్స్ చెప్పారు. ఎన్‌కౌంట‌ర్‌లో మ‌ర‌ణించిన రెండో ఉగ్ర‌వాది ఎవ‌ర‌న్న‌ది ఇంకా గుర్తించాల్సి ఉంద‌ని ఆయ‌న తెలిపారు.