
- పాటే ఆయుధంగా బీసీ రాజకీయ అధికారం సాధిస్తం: జాజుల
హైదరాబాద్, వెలుగు: పాటనే ఆయుధంగా చేసుకొని తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపి, ప్రత్యేక రాష్ట్రం సాధించినట్లుగానే.. బీసీల రాజకీయ అధికారం సాధించడానికి పాటలను ఉపయోగించుకుంటామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఇందుకు బీసీ కవులు, రచయితలు, కళాకారులు బీసీ భావజాల ఉద్యమాన్ని పల్లెపల్లెకు విస్తరించాలని కోరారు. ఆదివారం హైదరాబాద్‌లో బీసీ కల్చరల్ ఫోరం రాష్ట్ర కమిటీ సమావేశంలో జాజుల మాట్లాడారు.
బీసీలకు వారసత్వంగా గొప్ప చరిత్ర ఉందని, బీసీ కులాల్లో రాజులు, చక్రవర్తులు, మహనీయులు జన్మించారన్నారు. ఇలాంటి ఘనమైన చరిత్ర కలిగిన బీసీలు.. నేడు బలహీనంగా అర శాతం, ఐదు శాతం లేని వాళ్ల దగ్గర సాగిలపడి అడుక్కోవడంలో అర్థం లేదన్నారు . బీసీ కళాకారులు, కవులు తమ కలలను, గళాలను బీసీల వారసత్వాన్ని, సాంస్కృతిక చైతన్య వైభవాన్ని భవిష్యత్ తరాలకు చాటి చెప్పాలని పిలుపునిచ్చారు.