
- జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
హైదరాబాద్, వెలుగు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీకే సీఎం సీటు హామీతో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ రాజకీయ పాలసీని ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. అన్ని పార్టీలు బీసీలకు 60 సీట్లు ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు. సోమవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘కులానికొక సీటు.. బీసీలకే ఓటు’ అనే నినాదంతో 80 కుల సంఘాలు, 30 బీసీ సంఘాల సంయుక్త సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో జాజుల మాట్లాడారు. సామాజిక న్యాయం, సబ్బండ వర్గాలకు రాజ్యాధికారమే లక్ష్యంగా వచ్చే నెల 10న హైదరాబాద్‌లో బీసీల సింహగర్జన మహాసభను నిర్వహిస్తామని జాజుల తెలిపారు. బీసీలకు జనాభాకు తగ్గట్టు సీట్లు కేటాయించాలని, లేకుంటే అన్ని పార్టీలను బీసీ ద్రోహులుగా ప్రకటిస్తామని చెప్పారు. బీసీలను విస్మరించే పార్టీలకు వచ్చే ఎన్నికల్లో పతనం తప్పదని స్పష్టం చేశారు. సర్వే రిపోర్టులంటూ.. గెలుపు గుర్రాలంటూ రెండు, మూడు శాతం జనాభా కూడా లేనోళ్లకు టికెట్లు ఇస్తే ఆయా పార్టీలకు 2023 ఎన్నికలే చివరి ఎన్నికలవుతాయని హెచ్చరించారు.