కాచిగూడ, వెలుగు: కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం కాచిగూడలోని ఓ హోటల్లో బీసీ సంక్షేమ సంఘాలు, అఖిలపక్ష నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ కులగణన చేపట్టకుండా నియోజకవర్గాల పునర్విభజన, మహిళా బిల్లు తీసుకురావడం సరికాదన్నారు.
అగ్రకుల మహిళల ప్రయోజనాల కోసమే బీజేపీ ఈ బిల్లును తెస్తోందని ఆరోపించారు. మహిళా బిల్లుపై ఈనెల 16న ఢిల్లీలో పోరు దీక్ష, 17న పార్లమెంటు ముట్టడి చేపడతామని హెచ్చరించారు. ఈ పోరాటానికి బీఆర్ఎస్ మద్దతు ఉంటుందని ఎమ్మెల్సీ మధుసూదనా చారి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. కార్యక్రమంలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, ఎర్ర సత్యనారాయణ, గణేశ్ చారి, పలువురు బీసీ మహిళా నేతలు పాల్గొన్నారు.
