
- ఈ నెల 7న జరిగే ప్రోగ్రాంలో బీసీలు పెద్ద ఎత్తున పాల్గొనాలి: జాజుల
హైదరాబాద్, వెలుగు: గోవాలో ఈ నెల 7న జరగనున్న జాతీయ ఓబీసీ మహాసభల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ మహాసభకు అన్ని రాజకీయ పార్టీల నేతలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, బీసీ ప్రజలు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఆదివారం హైదరాబాద్‌లో బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యాలయంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్ రూపొందించిన జాతీయ ఓబీసీ మహాసభ పోస్టర్‌ను జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించి, మాట్లాడారు. దేశవ్యాప్తంగా జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లో 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, రిజర్వేషన్లపై విధించిన 50 శాతం పరిమితిని ఎత్తివేయాలని, బీసీలపై విధించిన క్రీమీలేయర్‌ను రద్దు చేయాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు, రిజర్వేషన్ల అమలు డిమాండ్లపై ఈ మహాసభలో చర్చిస్తామన్నారు.