త్వరలో బీసీ రథయాత్ర.. పరేడ్‌‌ గ్రౌండ్‌‌లో లక్ష మందితో సభ: జాజుల

త్వరలో బీసీ రథయాత్ర.. పరేడ్‌‌ గ్రౌండ్‌‌లో  లక్ష మందితో సభ:  జాజుల
  •     ఢిల్లీలోనూ ఆందోళనలు చేస్తం 
  •     రిజర్వేషన్లు సాధించేదాకా పోరాటం ఆపమని వెల్లడి  
  •     ఎంజీబీఎస్‌‌ వద్ద ఆందోళన.. పాల్గొన్న పీసీసీ చీఫ్​ మహేశ్ గౌడ్  


హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం పెంచిన బీసీ రిజర్వేషన్లను యథాతథంగా ఆమోదించాలని, వాటికి రాజ్యాంగబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని, అవసరమైతే బీసీ రిజర్వేషన్లు ఆమోదించే వరకు రాష్ట్రపతి భవన్ వద్ద ధర్నా చేపట్టాలని కోరారు. బీసీ బంద్‌‌లో భాగంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్‌‌లోని ఎంజీబీఎస్  వద్ద శనివారం తెల్లవారుజామున 4 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆందోళన నిర్వహించారు. ఇందులో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ.. బీసీ బంద్ విజయవంతమైందని తెలిపారు. ‘‘ఇది శాంపిల్ మాత్రమే. రానున్న రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. తెలంగాణ ఉద్యమం తరహాలో పోరాడుతాం. భవిష్యత్తులో జేఏసీలో చర్చించి అన్ని జిల్లాల్లో బీసీ రథయాత్ర చేపడతాం.  హైదరాబాద్‌‌లోని పరేడ్‌‌ గ్రౌండ్‌‌లో లక్ష మందితో బహిరంగ సభ నిర్వహిస్తాం. కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి ఢిల్లీకి వెళ్లి ఆందోళనలు చేస్తాం” అని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఇకనైనా బీసీ రిజర్వేషన్లను ఆమోదించాలని డిమాండ్ చేశారు. 


మేం చిత్తశుద్ధితో ఉన్నం: పీసీసీ చీఫ్ 

బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధిని ఎవరూ శంకించాల్సిన అవసరం లేదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఆపి మరీ బీసీ రిజర్వేషన్ల కోసం 23 నెలలుగా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ‘‘బీసీ కోటా విషయంలో ఒకరిపై మరొకరు నెపం నెట్టుకోవడం సరికాదు. బీసీ రిజర్వేజషన్ల పెంపుతో కాంగ్రెస్‌‌కు మైలేజీ వస్తుందని బీజేపీ అనుకుంటే.. ఆ పార్టీనే చొరవ తీసుకోవచ్చు కదా. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ప్రధాని అపాయింట్‌‌మెంట్ తీసుకుంటే సీఎం అఖిలపక్షంతో ఢిల్లీకి రావడానికి సిద్ధంగా ఉన్నారు” అని స్పష్టం చేశారు. కేంద్రం బీసీ బిల్లులను ఆమోదించి, రాజ్యాంగబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తే బీసీలు తిరగబడడం ఖాయమని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం హెచ్చరించారు. ఆందోళనలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఇరావత్ అనిల్, బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు. కాగా, ఆందోళన అనంతరం ఎంజీబీఎస్ నుంచి అసెంబ్లీ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.