మధురైలో జోర్దార్‭గా జల్లికట్టు

మధురైలో జోర్దార్‭గా జల్లికట్టు

తమిళనాడులో సంక్రాంతి సందర్బంగా నిర్వహించే జల్లికట్టు పోటీలు జోర్దార్‭గా సాగుతున్నాయి. ఎద్దులను కట్టడి చేసేందుకు యువత, స్థానికులు పోటీ పడుతున్నారు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా ఏటా తమిళనాడులో జల్లికట్టు పోటీలు నిర్వహిస్తారు. మధురై జిల్లాలోని పలమేడులో ఉదయం 8గంటలకే జల్లికట్టు పోటీలు ప్రారంభమయ్యాయి. ఎద్దుల కొమ్ములను వంచేందుకు యువత పోటీ పడుతున్నారు. జల్లికట్టు చూసేందుకు జనం వేలాదిగా తరలివచ్చారు. పోటీలు ప్రారంభమైన కొద్దిసేపటికే ఓ వ్యక్తి గాయాలపాలవడంతో అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

మొదటి రోజు మధురైలోని అవనియపురంలో జల్లికట్టు పోటీలు నిర్వహించారు. పోటీల్లో వందలాది మంది యువకులు పాల్గొన్నారు. ఆదివారం నిర్వహించిన జల్లికట్టు పోటీల్లో 60 మందికి గాయాలయ్యాయి. వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.  అవనియపురంలో జల్లికట్టు ఫైనల్స్ కోసం 1500 మంది పోలీసులతో భద్రత కల్పించారు. 40 ప్రత్యేక మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేశారు. ఎద్దులను లొంగదీసిన యువకులకు బహుమతులు అందజేశారు.