ఢిల్లీ జామా మసీదులోకి అమ్మాయిలను రానివ్వం : షాహీ ఇమామ్‌‌

ఢిల్లీ జామా మసీదులోకి అమ్మాయిలను రానివ్వం : షాహీ ఇమామ్‌‌

న్యూఢిల్లీ : ఢిల్లీలోని జామా మసీదులోకి మహిళల ప్రవేశాన్ని నిషేధిస్తూ మసీద్‌‌ షాహీ ఇమామ్‌‌ సయ్యద్‌‌ అహ్మద్‌‌ బుఖారీ గురువారం ఉత్తర్వులిచ్చారు. అమ్మాయిలు సింగిల్‌‌ గానీ, గ్రూపులుగా గానీ మసీదులోకి రావొద్దని గేట్లకు నోటీసులను అతికించారు. దీనిపై తీవ్ర దుమారం రేగడంతో ఇమామ్‌‌ వివరణ ఇచ్చారు. ప్రార్థనలు చేసుకోవడానికి వచ్చే వారిపై నిషేధం లేదని,  మసీదులో జరుగుతున్న కొన్ని ఇన్సిడెంట్స్‌‌ వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ‘‘జామా మసీదు ప్రార్థనా స్థలం. ప్రార్థనలు చేసుకునేందుకు ఇక్కడికి వచ్చే వారిని అనుమతిస్తాం. కానీ, చాలా మంది అమ్మాయిలు ఇక్కడికి వచ్చి మ్యూజిక్‌‌ వీడియోలు షూట్‌‌లు చేయడం, రీల్స్ చేయడం లాంటివి చేస్తున్నారు. అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. అలాంటివి చేయడానికి వచ్చే వారిపై మాత్రమే నిషేధం విధించాం”అని ఆయన పేర్కొన్నారు. కాగా, మొఘలుల కాలంలో నిర్మించిన ఈ మసీదును చూసేందుకు వేలాదిమంది వస్తుంటారని, ఇమామ్ ​నిర్ణయం సరికాదంటూ మహిళా హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇది మహిళా హక్కుల ఉల్లంఘనే అంటూ జాతీయ మహిళా కమిషన్‌‌ మండిపడింది. ఢిల్లీ మహిళా కమిషన్‌‌ చీఫ్ స్వాతి మాలివాల్‌‌ కూడా ఈ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ప్రార్థన చేసుకునే హక్కు మగవాళ్లకున్నట్లుగానే మహిళలకూ ఉంటుందని అన్నారు.

ఎల్జీ కోరడంతో ఉత్తర్వులు వాపస్

జామా మసీదులోకి అమ్మాయిల ఎంట్రీ నిషేధంపై ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా స్పందించారు. మసీదు షాహీ ఇమామ్‌‌ బుఖారీతో మాట్లాడి.. ఆ ఉత్తర్వును వాపస్ తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఆదేశాలను వెనక్కి తీసుకునేందుకు అంగీకరించారని రాజ్‌‌భవన్‌‌ వర్గాలు పేర్కొన్నాయి. మసీదు పవిత్రతను గౌరవించాలనే కండిషన్​తో ఇమామ్​ బుఖారీ ఆర్డర్ ఉపసంహరించుకోవడానికి అంగీచరించారని తెలిపాయి.