
దసరా పండుగ జమ్మిపూజతో ముగుస్తుంది. దానినే శమీ పూజ అని కూడా అంటారు. నవరాత్రి ఉత్సవాల అనంతరం చేసే శమీ పూజకు అత్యంత ప్రాముఖ్యత ఉందని పురాణాలు చెబుతున్నాయి. జమ్మి చెట్టుకు పూజించి కాగితంపై ఒక శ్లోకం రాశి.. ఆ కాగితాన్ని జమ్మికొమ్మలకు ఉంచాలి.
పూర్వ కాలంలో అటవీ ప్రదేశం ఎక్కువుగా ఉండేది . కాబట్టి గ్రామ పొలిమెరల్లో కాని.. దేవాలయాల్లో కాని తప్పకుండా జమ్మి చెట్టు ఉండేది. కాల క్రమేణ అడవులు అంతరించి పోయాయి. కాబట్టి జమ్మి కొమ్మను తీసుకొచ్చి.. ప్రాణ ప్రతిష్ట చేసి.. అమ్మవారిని ఆవాహన చేసి పూజలు చేస్తున్నారు.
శమీ శమయతే పాపం
శమీ శత్రు వినాశని
అర్జునస్య ధనుర్ర్థారి
రామస్య ప్రియదర్శిని
స్వస్తి శ్రీచాంద్రమానేన శ్రీవిశ్వావశునామ సంవత్సర ఆశ్వయుజ శుద్ద దశమి మొదలు..... స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ పరాభవ నామ సంవత్సర ఆశ్వయుజ శుద్ద నవమి వరకు అమ్మవారి ఆశీస్సులతో సర్వ రంగాల్లో విజయం చేకూరి మనోవాంఛ నెరవేరేలా అమ్మవారి కరుణ.. కటాక్షాలు కలగాలని ప్రార్థన
గోత్రం: .......
పేరు : .......... ధర్మపత్నీ సమేతస్య ...... ( భార్య పేరు)
సపుత్రకస్య .... ( కుమారులపేర్లు )... నామధేస్య......
సపుత్రికస్య ....( కుమార్తెల పేర్లు) నామవత్యాహ..... . .
ఇలా రాశిన తరువాత పై శ్లోకాన్ని పఠించాలి. జమ్మి చెట్టును అమ్మవారిగా భావించి.. పసుపు.. కుంకుమ.. అక్షింతలతో పూజ చేయాలి. అగర్ బత్తీలు, బెల్లం నైవేద్యంగా సమర్పించి.. హారతి ఇవ్వాలి. ఆ తరువాత శ్లోకాన్ని చదువుతూ మూడు ప్రదక్షిణాలు చేయాలి. ఆ తరువాత జమ్మి ఆకులను ( బంగారం) తీసుకొని పెద్దల చేతికి ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని తీసుకోవాలి. జమ్మి బంగారాన్ని పర్సుల్లో.. ఇంట్లో బీరువలో.. డబ్బును పెట్టే స్థలంలో రెండు మూడు ఆకులు పెట్టాలి. ఇలా చేయడం వలన అన్ని విధాల శుభం కలిగి.. ప్రతి పనిలో విజయం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.