- రంజీ ట్రోఫీ ఫైనల్లోకి కాశ్మీర్
- సెమీస్‌లో 6 వికెట్ల తేడాతో బెంగాల్‌పై విజయం
కళ్యాణి: ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న జమ్మూ కాశ్మీర్.. 67 ఏండ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్లోకి అడుగుపెట్టింది. పేసర్ ఆకిబ్ నబీ (9/123) సూపర్ బౌలింగ్‌కు తోడు వన్షజ్ శర్మ (43 నాటౌట్), అబ్దుల్ సమద్ (30 నాటౌట్), శుభమ్ పుండిర్ (27) రాణించడంతో బుధవారం ముగిసిన సెమీస్‌లో జమ్మూ కాశ్మీర్ 6 వికెట్ల తేడాతో బెంగాల్‌పై చరిత్రాత్మక విజయం సాధించింది. బెంగాల్ ఇచ్చిన 126 రన్స్ ఛేజింగ్‌లో 43/2 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట కొనసాగించిన జమ్మూ 34.4 ఓవర్లలో 126/4 స్కోరు చేసి నెగ్గింది. నబీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఈ సీజన్ ముందు వరకు 334 రంజీ మ్యాచ్‌లు ఆడిన జమ్మూ కాశ్మీర్ 45సార్లు మాత్రమే విజయం సాధించింది.
భారీ ఆధిక్యంలో కర్నాటక
లక్నో: ఉత్తరాఖండ్‌తో జరుగుతున్న మరో సెమీస్‌లో కర్నాటక 802 రన్స్ లీడ్‌లో కొనసాగుతోంది. రవిచంద్రన్ స్మరన్ (127), కేఎల్ రాహుల్ (70 బ్యాటింగ్), క్రుతిక్ కృష్ణ (52) రాణించడంతో.. కర్నాటక రెండో ఇన్నింగ్స్‌లో 63.5 ఓవర్లలో 299/6 స్కోరు చేసింది. అంతకుముందు 149/5 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట కొనసాగించిన ఉత్తరాఖండ్ తొలి ఇన్నింగ్స్‌లో 88.5 ఓవర్లలో 233 రన్స్‌కే ఆలౌటైంది. ఆదిత్య రావత్ (45 నాటౌట్) ఫర్వాలేదనిపించాడు. విద్యాధర్ పాటిల్, విజయ్ కుమార్ చెరో మూడు వికెట్లు తీశారు.
