జమ్మూ: శ్రీ మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్రం బోర్డు (ఎస్ఎమ్ వీడీబీ) భక్తులకు శుభవార్త చెప్పింది. జమ్మూ నుంచి త్రికూట పర్వతాల్లో కొలువై ఉన్న వైష్ణోదేవి ఆలయానికి డైరెక్ట్ హెలికాప్టర్ సర్వీసులను నడపనున్నట్టు తెలిపింది. జూన్ 18 నుంచి ఈ సర్వీసులు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. భక్తులకు మెరుగైన సేవలను అందించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్ఎమ్ వీడీబీ సీఈవో అన్షుల్ గార్గ్ తెలిపారు. బ్యాటరీ కార్, దర్శనం లో ప్రాధాన్యత, ప్రసాదం, రోప్ వేతో సహా అనుబంధ సౌకర్యాలను ప్యాకేజీగా అందిస్తా మని చెప్పారు.
భక్తులు తమ వెబ్ సైట్ ద్వారా ఛాపర్ సేవలను బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. కాగా, భక్తులు హెలికాప్టర్లో పంచి హెలిప్యాడ్‌లో దిగిన తర్వాత వైష్ణోదేవి భవన్‌కు తీసుకువెళ్తామని అధికారులు పేర్కొన్నారు. అక్కడ స్పెషల్ దర్శనం స్లిప్, ప్రసాదం, భైరోన్ ఆలయంలో ప్రార్థనలు చేయడానికి కేబుల్ కార్ టికెట్ అందిస్తామని వివరించారు. తిరుగు ప్రయాణంలో భక్తులు బ్యాటరీ కార్ సహాయంతో పంచి హెలిప్యాడ్ కు చేరుకోవచ్చని ఆ తర్వాత అక్కడి నుంచి హెలికాప్టర్లో జమ్మూ ఎయిర్ పోర్టుకు తీసుకువెళ్తామని వెల్లడించారు.