దేశంలో మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ సక్సెస్‌ఫుల్‌గా ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే దీని తెరవెనుక ఒక ఆందోళనకరమైన వాస్తవం దాగి ఉంది. నెలకు రూ.31వేల కోట్ల నుంచి రూ.33వేల కోట్ల వరకు SIP పెట్టుబడుల రూపంలో మార్కెట్లోకి వస్తున్నాయని మనం సంబరపడుతుంటాం. కానీ.. ఇన్వెస్టర్లు ఎంత వేగంగా మార్కెట్లోకి వస్తున్నారో, అంతే స్పీడుగా మెరుపుతీగల్లా మాయమైపోతున్నారట.
తాజా గణాంకాల ప్రకారం.. దేశంలో స్టార్ట్ అవుతున్న ఎస్‌ఐపీలలో దాదాపు 75 శాతం మధ్యలోనే నిలిచిపోతున్నాయని తేలింది. అంతకంటే షాకింగ్ విషయం ఏమిటంటే.. 90 శాతం ఎస్‌ఐపీలు కనీసం 5 ఏళ్ల కాల పరిమితిని కూడా పూర్తి చేసుకోవడం లేదట. సంపద సృష్టించడంలో అసలైన మ్యాజిక్ జరిగే ఏడు లేదా ఎనిమిదో ఏట వరకు ఇన్వెస్టర్లు వేచి ఉండలేకపోతున్నారని లేటెస్ట్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. అంటే దీర్ఘకాలిక పెట్టుబడి ప్రయోజనాలు పొందే వరకూ ఇన్వెస్టర్లలో ఓరిక ఉండటం లేదని ఇది సూచిస్తోంది.
ఇన్వెస్టర్లు ఇలా అర్థాంతరంగా వెళ్లిపోవటానికి ప్రధాన కారణం 'ఇన్వెస్టర్ సైకాలజీ' అని తేలింది. భారతీయ మార్కెట్లో చాలా మంది ఇన్వెస్టర్లు దీర్ఘకాలిక లక్ష్యాల కంటే.. గత ఏడాది కాలంలో వచ్చిన రిటర్నులను చూసి ఆకర్షితులు అవుతుంటారని తెలిసిందే. ఉదాహరణకు.. బంగారం ధరలు పెరిగినప్పుడు గోల్డ్ ఈటీఎఫ్ ల్లోకి భారీగా ఇన్వెస్టర్ల డబ్బు రావడం, ఐటీ లేదా స్మాల్ క్యాప్ స్టాక్స్ పుంజుకున్నప్పుడు వాటి వెనుక పరుగులు తీయడం మనం చూస్తున్నాం. ఇలాంటి ఇన్వెస్టర్లు మార్కెట్లో చిన్నపాటి ఒడిదుడుకులు రాగానే భయాందోళనకు గురై పెట్టుబడులను వెంటనే ఉపసంహరించుకుంటున్నారు. ఈ క్రమంలో కాంపౌండింగ్ ద్వారా లభించే భారీ లాభాలను వారు చేజార్చుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు.
మరోవైపు.. సోషల్ మీడియాలో యూట్యూబ్ బాబాల ప్రభావం పెరిగిపోవడం కూడా ఒక కారణం. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు గడించాలనే అత్యాశను కంటెంట్ క్రియేటర్లు సొమ్ము చేసుకుంటున్నారు. వాస్తవానికి ఇన్వెస్ట్‌మెంట్ అనేది క్రమశిక్షణతో కూడిన ప్రక్రియ అని మర్చిపోయి.. ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ కోసం చూస్తున్నారు. ఈ ప్రవర్తన వల్ల ఈక్విటీలపై నమ్మకం కోల్పోయిన ఇన్వెస్టర్లు మళ్లీ పాత పద్ధతుల్లోని యాన్యుటీ ప్లాన్లు, FDల వైపు మళ్లుతున్నారు. అవి ద్రవ్యోల్బణాన్ని కూడా అధిగమించలేవనే కనీస స్పృహ లేకుండా జస్ట్ సేఫ్టీ కోసమే అక్కడ డబ్బును పార్క్ చేస్తున్నారు.
మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ల వ్యవస్థలో ఉన్న లోపాలు కూడా ఈ పరిస్థితికి కారణాలుగా మారుతున్నాయి. చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు సరైన శిక్షణ లేకుండా కేవలం కమీషన్ల కోసం థీమాటిక్ ఫండ్లను ఇన్వెస్టర్లకు అంటగడుతున్నారు. బుల్ మార్కెట్ ఉన్నప్పుడు అంతా బానే ఉంటుంది కానీ.. మార్కెట్ కరెక్షన్ కి గురైనప్పుడు ఇన్వెస్టర్లు నష్టపోయి మార్కెట్ నుంచి శాశ్వతంగా వెళ్లిపోతున్నారు. ఈ పరిస్థితి మారాలంటే కేవలం ఫండ్ల పనితీరుపైనే కాకుండా, ఇన్వెస్టర్ల మనస్తత్వాన్ని అర్థం చేసుకుని వారికి సరైన ఇన్వెస్ట్మెంట్ గైడెన్స్ ఇచ్చే అడ్వైజరీ వ్యవస్థ బలోపేతం కావాలి. అప్పుడే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు మెరుపుతీగల్లా మాయం కాకుండా.. మహావృక్షాల్లాంటి సంపదను సృష్టించుకోగలుగుతారు. మెుత్తానికి ఇన్వెస్టర్లు చేస్తున్న సైకలాజికల్ మిస్టేక్స్ వారిని సంపన్నులుగా మారే ప్రయత్నం నుంచి మధ్యలోనే వెళ్లిపోయేలా చేస్తున్నాయి.
