ప్రభుత్వ పథకాల పేరుతో లింక్స్..క్లిక్ చేస్తే అకౌంట్ ఖాళీ

ప్రభుత్వ పథకాల పేరుతో లింక్స్..క్లిక్ చేస్తే అకౌంట్ ఖాళీ
  • కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు
  • ‘జన్ ధన్ యోజన’ పేరుతో సోషల్ మీడియాలో పోస్టులు, యాడ్స్
  • రూ.5 వేలు ఉచితమంటూ లింక్స్ 
  • జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసుల హెచ్చరిక

హైదరాబాద్, వెలుగు:  సైబర్ నేరగాళ్లు మోసాలకు కొత్త దారులను ఎంచుకుంటున్నారు. ఇప్పటి వరకు డెబిట్​కార్డ్, క్రెడిట్ కార్డ్, ఓటీపీ వంటి మోసాలకు పాల్పడేవారు. కానీ ఇప్పుడు సీజన్​ను బట్టి నేరాలకు పాల్పడుతున్నారు. దసరా, దీపావళి, సంక్రాంతి తదితర ఫెస్టివల్స్ టైమ్ లో స్పెషల్ ఆఫర్స్, క్యాష్ బ్యాక్​ల పేరుతో, ఇటీవల అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ సమయంలో తక్కువ ధరకే ప్రత్యేక దర్శనం, పూజలు అంటూ జనాలను బురిడీ కొట్టించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు ఉండడంతో ప్రభుత్వ పథకాల పేరుతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ, లింక్స్ పంపిస్తూ ప్రజలను ట్రాప్​ చేస్తున్నారు. 

కేంద్ర ప్రభుత్వం ‘జన్​ధన్​ యోజన’ పథకం కింద ప్రతి ఒక్కరి అకౌంట్ లో రూ.5 వేలు ఉచితంగా వేస్తోందంటూ సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో పాటు జనం ఎక్కువగా వాడే యాప్స్ లో యాడ్స్ కూడా ఇస్తున్నారు. డబ్బులు అకౌంట్లోకి రావాలంటే అందులో ఇచ్చిన లింక్​ను క్లిక్ చేయాలని చెబుతున్నారు. అది చూసి నిజమేనని నమ్మి, వాటిపై క్లిక్ చేస్తున్నోళ్ల అకౌంట్ల నుంచి డబ్బులు కాజేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు ఇచ్చిన లింక్ ను క్లిక్ చేస్తే అచ్చం ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్​లాంటి ఒక పేజీ ఓపెన్​ అవుతున్నది. అందులో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోతో పాటు ‘భారత్ జన్​ధన్​ యోజన ద్వారా ప్రభుత్వం భారతదేశంలోని ప్రతి ఒక్కరికీ రూ.5 వేలు ఉచితంగా ఇస్తున్నది. ఆ డబ్బును విత్ డ్రా చేసుకోవడానికి ఇక్కడ స్క్రాచ్​చేయండి’ అని ఉంటున్నది​. దాన్ని స్క్రాచ్ చేసిన వెంటనే ఆ అమౌంట్​ను గెలుచుకున్నట్లు చూపించి, ఆ పేజ్​రీడైరెక్ట్​ అయి యూపీఐకి కనెక్ట్ అవుతున్నది. అక్కడ యూపీఐ నంబర్ అడుగుతున్నది. తొందరపడి ఆ నంబర్ ఎంటర్ చేస్తే, అకౌంట్​లో ఉన్న డబ్బంతా ఖాళీ అవుతున్నది. ఇటీవల ఇలాంటి మోసపూరిత యాడ్స్ ఎక్కువయ్యాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. 

జనం జాగ్రత్తగా ఉండాలి..

ఇటీవల సీజనల్​సైబర్ మోసాలు ఎక్కువవుతున్నాయి. కొన్నిసార్లు సైబర్ నేరగాళ్లు పంపిన లింక్స్​ను క్లిక్ చేసిన వెంటనే మొబైల్​ఆపరేటింగ్​అంతా నేరస్తుల చేతుల్లోకి వెళ్లిపోతుంది. మరికొన్ని సార్లు బ్యాంక్ డీటెయిల్స్, ఓటీపీ ఎంటర్ చేస్తేనే మోసం చేయడానికి సాధ్యమవుతుంది. తెలియని నంబర్స్ నుంచి వచ్చిన లింక్స్​ను అస్సలు ఓపెన్ చేయొద్దు. అలా చేయడం వల్ల నేరగాళ్లు మళ్లీ మళ్లీ లింక్స్ పంపడానికి అవకాశం ఉండదు. అలాగే వివిధ యాప్స్, వెబ్ సైట్స్ లో వచ్చే యాడ్స్ విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి.  
- శివమారుతి,  సైబర్​క్రైమ్ ఏసీపీ, హైదరాబాద్