Thalapathy Vijay: సినీ ప్రస్థానానికి వీడ్కోలు: మలేషియాలో విజయ్ ‘జననాయకన్’ మెగా ఈవెంట్.. షెడ్యూల్ ఇదే!

Thalapathy Vijay: సినీ ప్రస్థానానికి వీడ్కోలు: మలేషియాలో విజయ్ ‘జననాయకన్’ మెగా ఈవెంట్.. షెడ్యూల్ ఇదే!

తమిళ చిత్రసీమలో ఒక శకం ముగియబోతోంది.  దళపతి విజయ్ తన సినీ ప్రస్థానానికి ముగింపు పలుకబోతున్నారు.  ఇక నుంచి పూర్తిగా రాజకీయ రణక్షేత్రంలోకి అడుగుపెడుతున్న వేళ.. ఆయన చివరి చిత్రం 'జననాయకన్' (Jana Nayagan) ఆడియో లాంచ్ వేడుక ఒక చారిత్రక ఘట్టంగా మారుతోంది. ఈ మెగా ఈవెంట్ కోసం విజయ్ ఈరోజు ఉదయం చెన్నై విమానాశ్రయం నుండి మలేషియాకు బయలుదేరారు. రాజకీయ పార్టీ 'తమిళగ వెట్రి కళగం' (TVK) ద్వారా పూర్తిస్థాయి ప్రజాసేవలోకి వెళ్లేముందు విజయ్ ఇస్తున్న ఈ 'ఫేర్‌వెల్' ట్రీట్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ తంబీలు వేచి చూస్తున్నారు.

విమానాశ్రయంలో సందడి

శుక్రవారం ఉదయం చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం అభిమానుల కోలాహలంతో నిండిపోయింది. బ్లాక్ షర్ట్, క్లాసిక్ డెనిమ్ జీన్స్‌లో స్టైలిష్‌గా కనిపించిన విజయ్, తన తల్లి శోభ చంద్రశేఖర్‌తో కలిసి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. సెక్యూరిటీ చెకప్ ముగిసిన తర్వాత, తనను చూడటానికి తరలివచ్చిన వేలాది మంది అభిమానులకు అభివాదం చేస్తూ ఆయన లోపలికి వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో 'ట్రెండింగ్'లో ఉన్నాయి.

 

బుకిత్ జలీల్ స్టేడియంలో 'దళపతి కచ్చేరి'

  కోట్లాది మంది అభిమానుల ఆరాధ్య దైవం, 'దళపతి' విజయ్ తన కెరీర్‌లో 69వ ఆఖరి చిత్రంగా వస్తున్న చిత్రం 'జననాయకన్'  ఆడియో లాంచ్ మలేషియాలో గ్రాండ్  ఆడియో లాంచ్  చేయబోతున్నారు.  ప్రఖ్యాత బుకిత్ జలీల్ నేషనల్ స్టేడియం రేపు (డిసెంబర్ 27) జనసంద్రం కాబోతోంది. సుమారు 90,000 మంది కూర్చునే సామర్థ్యం ఉన్న ఈ స్టేడియంలో 10 గంటల పాటు సుదీర్ఘంగా వేడుకలు జరగనున్నాయి. 

ఈ ఈవెంట్‌ను రెండు భాగాలుగా విభజించారు . దళపతి త్రివిళ కార్యక్రమంలో  దాదాపు 30 మంది ప్రముఖ గాయకులు విజయ్ హిట్ సాంగ్స్‌తో 5 గంటల పాటు అలరించనున్నారు. అనురాధ శ్రీరామ్, SPB చరణ్, సైంధవి, ఆండ్రియా వంటి గాయకలు తమ గానంలో అలరించనున్నారు. ఆ తర్వాత ఆడియో లాంచ్  కార్యక్రమంలో హీరో విజయ్, దర్శకుడు హెచ్. వినోద్, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, కథానాయిక పూజా హెగ్డే, విలన్ బాబీ డియోల్ ఈ వేడుకలో పాల్గొని చిత్ర విశేషాలను పంచుకోనున్నారు.

సినిమాపై అంచనాలు

మల్టీస్టారర్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న 'జననాయకన్' జనవరి 9, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. విజయ్ రాజకీయ ప్రవేశానికి ముందు వస్తున్న సినిమా కావడంతో, ఇందులో ఉండే డైలాగులు, పొలిటికల్ టచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రభుదేవా, నెల్సన్ దిలీప్ కుమార్ వంటి ప్రముఖులు మలేషియా చేరుకొని ఈ మెగా ఈవెంట్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఒక నటుడిగా విజయ్ ఇచ్చే చివరి స్పీచ్ ఇదే అయ్యే అవకాశం ఉండటంతో, మలేషియా ప్రభుత్వం కూడా భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. రేపు స్టేడియంలో విజయ్ చేసే ప్రసంగం తమిళ రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి!