ప్రధాని మోదీకి పవన్​ కళ్యాణ్​ లేఖ: ఇళ్ల నిర్మాణంలో నిధులు గోల్​ మాల్​

ప్రధాని మోదీకి పవన్​ కళ్యాణ్​ లేఖ:  ఇళ్ల నిర్మాణంలో నిధులు గోల్​ మాల్​

ఏపీలో ఇళ్ల నిర్మాణం పేరిట భారీ కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రధాని నరేంద్ర మోదీకి (PM Narendra Modi) లేఖ రాశారు. దీనిపై సీబీఐ (CBI) వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేయించాలని తన 5 పేజీల లేఖలో పేర్కొన్నారు. ఇళ్ల పట్టాలు, నిర్మాణంపై ప్రభుత్వం భిన్న ప్రకటనలు చేస్తోందని మండిపడ్డారు. 'వైసీపీ పాలనలో భూ సేకరణ పేరిట రూ.32,141 కోట్లు దుర్వినియోగం చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు భూ సేకరణలో కీలకంగా వ్యవహరించారు. గతంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను సైతం లబ్ధిదారులకు పూర్తిగా ఇవ్వలేదు. 6.68 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తైతే 86,984 మందికే ఇళ్లు ఇచ్చారు. వీటన్నింటిపైనా కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలి.' అని లేఖలో కోరారు.


పేదలకు సంబంధించి ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టు వ్యయం రూ.1,75,421 కోట్లు అయితే, ప్రభుత్వం మాత్రం రూ.91,503 కోట్లుగా చెబుతోంది.. ఈ అంశంలో అనేక సందేహాలున్నాయని లేఖలో పేర్కొన్నారు పవన్‌.. ఇళ్ల విషయంలో ప్రభుత్వం పేదలను మోసం చేయడమే కాకుండా, ప్రజాధనాన్ని పూర్తిగా దోపిడీ చేసిందన్న ఆయన..  ఈ మొత్తం పథకంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజాధనాన్ని భారీగా పక్కదారి పట్టించిందని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. పథకం పేరుతో వైసీపీ నాయకులు భారీగా లాభపడ్డారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పేదలందరికీ ఇళ్లు పథకంలో కేంద్ర ప్రభుత్వ గృహ స్కీంలను కలిపేసిందన్నారు.. పీఎంఏవై, జేజేఎం, ఎంజీఎన్ఆర్ఈజీపీ, ఎస్బీఎం తదితర కేంద్ర పథకాల నిధులను ఇష్టానుసారం కలిపేసి ఆ నిధులను వైసీపీ పథకానికి వాడుకున్నారని ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖలో పేర్కొన్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్.

ప్రభుత్వం తీరుతో  లబ్ధిదారులు విసుగుచెందారు’ అని పవన్‌ తన లేఖలో పేర్కొన్నారు అన్నింటిపైనా కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని కోరారు. పవన్ కల్యాణ్ ఈ లేఖ రాజకీయవర్గల్లోనూ ఆసక్తి రేపుతోంది. ఇది ఆషామాషీ లేఖ కాదని.. పొత్తుల గురించి చర్చలు బయటకు వచ్చిన సమయంలో రాసిన లేఖ రాయడం వెనుక వ్యూహం ఉందని భావిస్తున్నారు.