పార్టీని నడిపేందుకు సైద్ధాంతిక బలం కావాలి

పార్టీని నడిపేందుకు సైద్ధాంతిక బలం కావాలి

వచ్చే ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తామన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.  జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా అమరావతిలోని ఇప్పట గ్రామంలో  ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సభకు కార్యకర్తలు,అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్బంగా కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపిన పవన్..  ఇప్పటం గ్రామ పంచాయితీకి తన వ్యక్తిగత ట్రస్ట్ తరపున రూ. 50లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. జై ఆంధ్రా జై తెలంగాణ అంటూ ప్రసంగం ప్రారంభించిన పవన్ కళ్యాణ్.. తనకు రాజకీయాలపై అవగాహన కల్పించిన నాగబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీలో బూతులు తిట్టే నాయకులే కాకుండా మంచి నాయకులు కూడా ఉన్నారని అన్నారు.

ఒక పార్టీని నడపాలంటే డబ్బు మాత్రమే కాదు సైద్ధాంతిక బలం కూడా కావాలన్నారు పవన్ కల్యాణ్. సింధువైనా ..బిందువుతోనే మొదలవుతుందన్న ఆయన.. జనసేనలో సీనియర్ నాయకులెవరూ లేరన్నారు. విజయం వచ్చినప్పుడు కాకుండా అపజయం వచ్చినప్పుడు ఎలా నిలబడ్డామనేదే ముఖ్యమన్నారు. ఏడు శాతం ఓట్ల నుంచి ప్రభుత్వాన్ని స్థాపించే స్థాయికి జనసేన ఎదగబోతోందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రం అంధకారంలోకి వెళ్లకూడదంటే జనసేన కార్యకర్తల చేతుల్లో ఉందన్నారు.  ప్రశ్నించడాన్ని సులభంగా తీసుకోవద్దన్న పవన్.. ప్రశ్నించడమంటే పోరాటానికి సిద్ధంగా ఉండటమేనని అన్నారు. వ్యక్తిగత లాభాల కోసం కార్యకర్తల జీవితాలను తాకట్టు పెట్టబోనని.. అవసరమైతే తన ప్రాణాలను త్యాగం చేస్తానన్నారు.. 2014లో ప్రశ్నించిన జనసేన.... 2019లో బలంగా పోరాడి బరిలో నిలబడిందని అన్నారు.  2024లో గట్టిగా నిలదొక్కుకుని ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్థామన్నారు పవన్ కళ్యాణ్.