- తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామన్న జనసేన
- పొత్తు ప్రసక్తే లేదంటున్న బీజేపీ
- కాషాయ కోటలో కన్ఫ్యూజన్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగక ముందే.. బీజేపీ, జనసేన మధ్య ‘పొత్తు’ లొల్లి మొదలైంది. ఏ ఎన్నికలొచ్చినా ‘మేము సైతం’ అంటూ జనసేన చేసే ప్రకటనలు బీజేపీకి మింగుడు పడటం లేదు. క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం లేకపోయినా, జనం మధ్యలో ఉండకపోయినా.. ఎన్నికలప్పుడు మాత్రం జనసేన హడావుడి చేయడం బీజేపీకి తలనొప్పిగా మారింది. రాష్ట్రంలో వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామని జనసేన ప్రకటించడంతో.. పొత్తు ఉంటుందా.. ఉండదా.. అనే అయోమయం నెలకొన్నది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్యనే ప్రధాన పోటీ ఉండనున్నది.
ఈ క్రమంలో జనసేన కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించడంతో బీజేపీ నేతల్లో చర్చ మొదలైంది. అయితే, బీజేపీ ముఖ్య నేతలు ఎవ్వరూ జనసేనతో పొత్తుకు సిద్ధంగా కనిపించడం లేదు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో జనసేన యాక్టివ్‌గా లేదు. దీంతో మున్సిపాలిటీల్లో ఆ పార్టీ ప్రభావం పెద్దగా ఉండబోదని బీజేపీ నేతలు చెప్తున్నారు. అయితే, ఇటీవల జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కొండగట్టులో పర్యటన సందర్భంగా ఆ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. తర్వాతి కొన్ని రోజులకే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామనే ప్రకటన రావడం గమనార్హం.
జనసేనతో పొత్తు నష్టమే..
ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నంత మాత్రాన.. తెలంగాణలోనూ పొత్తు ఉండాలన్న రూల్ ఏమీ లేదని బీజేపీ రాష్ట్ర నేతలు చెబుతున్నారు. ఏపీ పరిస్థితులు వేరని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉందని, ఇక్కడ జనసేనతో పొత్తు పెట్టుకుంటే లాభం కన్నా నష్టమే ఎక్కువని భావిస్తున్నారు. పొత్తుల నిర్ణయం ఢిల్లీ పెద్దల చేతిలో ఉన్నప్పటికీ.. ఈసారి మాత్రం కచ్చితంగా వద్దని అధిష్టానానికి చెప్పేందుకు రాష్ట్ర నేతలు సిద్ధమవుతున్నారు. అనవసర ప్రకటనలతో క్యాడర్‌ను కన్ఫ్యూజ్ చేయొద్దని, ఒంటరిగానే బరిలోకి దిగుతామని స్పష్టం చేస్తున్నారు.
