హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. తన రిజైన్ లెటర్‌ను సీఎం చంద్రబాబు, టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడికి పంపించినట్లు తెలిపారు. శుక్రవారం ఏపీలోని విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘2005లో తాను టీటీడీ డోర్డు సభ్యుడిగా ఉన్న సమయంలో గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం డొనేషన్ స్కీం కింద 500 గజాల స్థలం కేటాయించారు. అప్పట్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల నిర్మాణం పూర్తి చేయలేకపోయా. ఈ మేరకు డొనేషన్ చెల్లించేందుకు గడువు పెంచాలని కోరాను.
దీనికి కోసం జీవో జారీ కాగా, మళ్లీ భూమి కేటాయించాలని టీటీడీని కోరాను. అందుకు బోర్డు తీర్మానం చేసి, సీఎంకు పంపారని తెలిసింది. నాకు భూమి కేటాయించాలా.. వద్దా అనేది ప్రభుత్వ నిర్ణయం. బోర్డు సభ్యుల్లో బీజేపీ నేత భానుప్రకాశ్ ఒక్కరే తనకు భూమి కేటాయించడాన్ని వ్యతిరేకించారు. తనకు స్థలం కేటాయించడం వల్ల బోర్డు తప్పు చేసిందనే ఆలోచన రాకూడదనే నేను రిజైన్ చేశాను” అని పేర్కొన్నారు.
