జనగామ అర్బన్, వెలుగు: ఆరోగ్యకరమైన తల్లి, కుటుంబం, బలమైన సమాజానికి పునాది అని జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య వారోత్సవాల కింద బుధవారం జిల్లాస్థాయి సురక్షిత మాతృత్వ దినోత్సవం సందర్భంగా వర్క్ షాప్ ను కలెక్టరేట్ లో ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా స్థాయిలో మాతా, శిశు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఆశాలు, ఏఎన్ఎంలు, అంగన్వాడీల పాత్ర అత్యంత కీలకమన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లోనే నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు వాటిని వినియోగించుకునేలా చూడాలన్నారు.
అంతకుముందు మాతా శిశు సంరక్షణపై, పీసీ అండ్ పీఎన్డీటీ యాక్ట్ అమలు, సాధారణ ప్రసవాల పెంపు, పోషకాహారం, తదితరాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వైద్యాధికారులు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో మల్లికార్జున రావు, డీసీహెచ్ఎస్ నరేందర్ శర్మ, జీజీహెచ్ సూపరింటెండెంట్ రాజలింగం, డీడబ్ల్యూవో కోదండరాములు తదితరులు పాల్గొన్నారు.
