జపాన్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో అక్కడి ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధం కారణంగా క్రూడ్ ఆయిల్ సరఫరాలో ఏర్పడిన అంతరాయం నేపథ్యంలో.. తన వ్యూహాత్మక నిల్వల నుంచి రికార్డు స్థాయిలో చమురును రిలీజ్ చేయాలని జపాన్ ప్రధాని సనే తకైచి నిర్ణయించారు. ఇది జపాన్ ఇంధన రంగ చరిత్రలో అతిపెద్ద అత్యవసర పరిస్థితిగా నిలిచింది.
చరిత్రలో మొదటిసారి..
జపాన్ ప్రభుత్వం తన జాతీయ నిల్వల నుంచి సుమారు 80 మిలియన్ బ్యారెళ్ల చమురును మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఇది ఆ దేశ 45 రోజుల మొత్తం వినియోగానికి సమానం. సాధారణంగా యుద్ధాలు లేదా ప్రకృతి వైపరీత్యాల సమయంలో మాత్రమే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. 2011 ఫుకుషిమా విపత్తు సమయంలో విడుదల చేసిన దానికంటే ఇది 1.8 రెట్లు ఎక్కువని తేలింది. గత వారం ప్రైవేట్ రంగ నిల్వలను విడుదల చేసిన ప్రభుత్వం, ఇప్పుడు నేరుగా ప్రభుత్వ ఆధీనంలోని నిల్వలపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడింది.
ఎందుకు ఈ కఠిన నిర్ణయం?
జపాన్ తన చమురు అవసరాల కోసం 90 శాతానికి పైగా గల్ఫ్ దేశాలపైనే ఆధారపడుతోంది. ప్రస్తుతం అమెరికా-ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల ఇంధన సరఫరాకు కీలకమైన 'హార్ముజ్ జలసంధి' దాదాపు మూతపడింది. దీనివల్ల జపాన్‌కు రావాల్సిన ట్యాంకర్లు నిలిచిపోయాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 100 డాలర్లు దాటి దూసుకుపోతుండటంతో జపాన్ పెట్రోల్ ధరలను నియంత్రించడానికి, పరిశ్రమలు మూతపడకుండా చూడటానికి ఈ 'ఎనర్జీ ఎమర్జెన్సీ'ని ప్రకటించింది.
కేవలం జపాన్ మాత్రమే కాకుండా, అంతర్జాతీయ ఇంధన సంస్థ ఆధ్వర్యంలో మొత్తం 32 సభ్య దేశాలు కలిసి 400 మిలియన్ బ్యారెళ్ల చమురును విడుదల చేయాలని నిర్ణయించాయి. ఇది ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద కోఆపరేటెడ్ క్రూడ్ ఆయిల్ విడుదల. ఈ భారీ నిల్వల విడుదల ద్వారా ఆయిల్ మార్కెట్లను శాంతపరిచి, ఆకాశాన్నంటుతున్న ధరలకు బ్రేకులు వేయాలని జపాన్ భావిస్తోంది.
ప్రస్తుతం జపాన్‌లో గ్యాసోలిన్ ధరలు లీటరుకు 190.8 యెన్ల ఆల్‌టైమ్ హైకి చేరుకున్నాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఈ ధరలను 170 యెన్ల స్థాయికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒకవేళ యుద్ధం మరికొన్ని వారాలు కొనసాగితే, మరిన్ని నిల్వలను విడుదల చేయడానికి కూడా వెనకాడబోమని జపాన్ ఆర్థిక శాఖ ప్రకటించింది. ఈ సంచలన నిర్ణయం గ్లోబల్ మార్కెట్లలో జపాన్ పట్టును, దేశ ప్రయోజనాల కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధమని నిరూపిస్తోంది.
