పేలిపోయిన జపాన్ విమానం.. అందులో 375 మంది ప్రయాణికులు..

పేలిపోయిన జపాన్ విమానం.. అందులో 375 మంది ప్రయాణికులు..

ఇప్పటికే  భూకంపలతో అల్లకల్లోలం అవుతున్న జపాన్  లో మరో ఘోరం జరిగింది.  జపాన్ లోని  హనెడా విమానాశ్రయంలో జపాన్ కు చెందిన ఎయిర్‌లైన్స్ విమానం రన్‌వేపై  దిగుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.   375 మందితో ప్రయాణిస్తున్న ఈ విమానం ఎయిర్‌పోర్టులో కోస్ట్ గార్డ్ విమానాన్ని ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగాయి.  దీనికి సంబంధించిన విజువల్స్ సీసీ టీవీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి.  

వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు  ఆర్పడానికి తీవ్రంగా ప్రయత్నించారు.  ప్రమాదం జరిగిన సమయంలో జేఏల్‌ 516 విమానంలో సిబ్బంది, ప్రయాణికులు కలిపి 400 మంది వరకు ఉన్నారని ఎన్‌హెచ్‌కే పేర్కొన్నట్లు జపాన్‌ టైమ్స్‌ వెల్లడించింది. వీరందరినీ బయటకు చేర్చినట్లు తెలిపింది. ఎంతమంది గాయపడ్డారో కచ్చితంగా తెలియరాలేదు.  జపాన్‌లోని అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో హనేడా ఒకటి, చాలా మంది ప్రజలు న్యూ ఇయర్ సెలవుల్లో ప్రయాణిస్తారు.

మరోవైపు భారీ భూకంపానికి జపాన్ వణికిపోయింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.6గా నమోదైంది. సోమవారం సాయంత్రం 90‌‌‌‌ నిమిషాల్లో 21 సార్లు భూమి కంపించింది. ప్రతి సారీ రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత కనీసం 4.0 పైనే నమోదైందని జపాన్ వాతావరణ శాఖ ప్రకటించింది. జపాన్​లోని ఇషికావా, నైగటా, టయోమా, నోటో రాష్ట్రాల్లో భూమి కంపించింది. 

మొదట 5.7 తీవ్రతతో భూ ప్రకంపనలు మొదలయ్యాయని, ఒక దశలో తీవ్రత రిక్టర్‌‌ స్కేల్‌‌పై 7.6గా నమోదైందని వివరించింది. తీవ్ర స్థాయిలో భూమి కంపించడంతో ఇండ్లు, ఆఫీసుల్లోని జనాలు రోడ్లపైకి పరుగులు పెట్టారు. దీంతో అక్కడి రవాణావ్యవస్థ స్తంభించిపోయింది. రోడ్లు, రైల్వే ట్రాక్​లకు పగుళ్లు ఏర్పడ్డాయి. దీనికితోడు చాలా ప్రాంతాల్లో కరెంట్ సరఫరా కూడా నిలిచిపోయిందని అధికారులు వివరించారు