
టోక్యో: హగిబీస్ తుఫాను దెబ్బకు జపాన్ వణుకుతోంది. ఇప్పటివరకు కనీసం 33 మంది వరకు చనిపోయారు. మరో 15 మంది గల్లంతయ్యారు. వందలాది మంది గాయాలపాలయ్యారు. దేశవ్యాప్తంగా ఉన్న 14 నదులు పొంగిపొర్లడంతో ఊర్లకు ఊర్లే మునిగిపోయాయి. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది నిరంతరం పనిచేస్తున్నారు. ప్రజలను హెలికాప్టర్లు, బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆదివారం ఉదయానికి తుఫాను బలహీన పడినా.. చేయాల్సిన విధ్వంసం మాత్రం చేసి వెళ్లింది. ప్రమాదం మాత్రం ఇంకా ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. కొండచరియలు విరిగిపడొచ్చని, వరదలు పోటెత్తొచ్చని చెబుతున్నారు.
27 వేల మిలటరీ ట్రూప్స్..
ఆదివారం ఉదయం వరకు గంటకు 150 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచాయి. దీంతో కార్లు, ట్రక్కులు కూడా గాల్లోకి లేచాయి. ఇళ్ల పైకప్పులు, హోర్డింగులు ఎగిరిపోయాయి. ఇళ్లు ధ్వంసమయ్యాయి. వరదలతో నదులు ఉప్పొంగుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే జలమయమయ్యాయి. టోక్యోతో పాటు చుట్టుపక్కల నగరాల్లో కుంభవృష్టి కురిసింది. ‘‘తూర్పు జపాన్లో తుఫాన్ బీభత్సం సృష్టించింది. సహాయక చర్యల కోసం సెల్ఫ్డిఫెన్స్ఫోర్స్కు చెందిన 27 వేల మందిని రంగంలోకి దింపాం. వీరితో ఇతర సిబ్బంది కూడా రెస్క్యూ చర్యలు చేపడుతున్నారు” అని ప్రభుత్వ అధికార ప్రతినిధి యోషిహిడే సుగా చెప్పారు. 3.76 లక్షల ఇళ్లకు కరెంటు సప్లై కావడం లేదని, 14 వేలకు పైగా ఇళ్లు నీటమునిగాయని తెలిపారు. ఆదివారం ఉదయం జరగాల్సిన రగ్బీ మ్యాచ్లు కూడా క్యాన్సిల్ చేశారు. పలు రైళ్లు, విమాన సర్వీసులను రద్దు చేశారు.
నది గట్టు తెగింది..
భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరదల ధాటికి చికుమా నది గట్టు తెగిపోయింది. పక్కన ఉన్న నగానో పట్టణంలోకి వరదనీళ్లు పోటెత్తాయి. దీంతో ఊరు ఊరంతా మునిగిపోయింది. ఐదు మీటర్ల ఎత్తు వరకు నీళ్లు చేరినట్లు అధికారులు చెప్పారు. అక్కడ చిక్కుకున్న వారిని కాపాడేందుకు హెలికాప్టర్లను పంపారు. ఇళ్లల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇంకా చాలా మంది ఇళ్ల పైకప్పులపై నిలబడి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. టోక్యో మీదుగా ప్రవహించే టామా నది కూడా పొంగిపొర్లుతోంది. చుట్టుపక్కల ప్రాంతాలు జలమయమయ్యాయి. జపాన్కే వన్నెతెచ్చిన బుల్లెట్ట్రైన్లను ఎక్కడికక్కడ స్టేషన్లలో నిలిపేశారు. అయితే అక్కడ కూడా పట్టాలపై నీళ్లు చేరాయి. నగానో స్టేషన్కు దగ్గర్లోని ఈస్ట్ జపాన్ రైల్వే యార్డులో బుల్లెట్ ట్రైన్లను పార్క్ చేశారు.
జాగ్రత్తగా ఉండండి
‘‘ప్రజల ప్రాణాలకే తొలి ప్రాధాన్యం. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు చర్యలు కొనసాగించండి. కనిపించకుండా పోయిన వారి కోసం గాలించండి. లక్షా పదివేల మంది పోలీసులు, ఫైర్ ఫైటర్లు, కోస్ట్ గార్డ్ అధికారులు, సెల్ఫ్ డిఫెన్స్ఫోర్స్ సిబ్బంది.. సహాయక చర్యలు చేపడుతున్నారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉంది. అలాగే నదులు పొంగి వరదలు పోటెత్తవచ్చు. ప్రజలు జాగ్రత్తగా ఉండండి’’
– జపాన్ ప్రధాని షింజో ఆబే
త్వరగా కోలుకోవాలి
‘‘హగిబీస్ తుఫాను మృతుల కుటుంబాలకు ఇండియా ప్రజలందరి తరఫున సంతాపం తెలుపు తున్నా. ఈ విపత్తు నుంచి జపాన్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. ప్రస్తుత పరిస్థితుల్లో ఇండియా మీకు సంఘీభావంగా నిలబడుతుంది. అవసరం అనుకుంటే ఇప్పుడు అక్కడే ఉన్న మా నేవీ అధికారులు.. సాయం చేస్తారు”
– ప్రధాని నరేంద్ర మోడీ