- జపాన్ ఫెస్టివల్‌లో మంత్రి వివేక్ వెంకటస్వామి
- ఇటీవల పర్యటనతో జపాన్‌లో 500 మందికి తక్షణ కొలువులు
- 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంలో జపాన్‌దే కీలక పాత్ర
- ఇప్పటికే హిరోషిమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో ఒప్పందం
- ఇండస్ట్రియల్ ఆటోమేషన్, ప్రాక్టికల్ ట్రైనింగ్ తప్పనిసరి
హైదరాబాద్, వెలుగు: రాబోయే ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలోని 45 లక్షల మంది యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్య శిక్షణ అందించి దేశీయంగా, విదేశాల్లో ఉపాధి కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని శక్తి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రకటించారు. జపాన్ సాంకేతిక సహకారంతో ఈ భారీ లక్ష్యాన్ని సాధించే దిశగా ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’కి జపాన్‌లోని ప్రసిద్ధ ‘హిరోషిమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’తో సూత్రప్రాయంగా భాగస్వామ్యం కుదిరిందని చెప్పారు.
'గత 20 ఏళ్లలో హైదరాబాద్-మియోషి మధ్య నమ్మకమైన స్నేహాన్ని నిర్మించుకున్నాం.. రాబోయే 20 ఏళ్లలో ఉమ్మడి ఆర్థిక ప్రయోజనాలు, సరికొత్త ఉద్యోగావకాశాలను సృష్టిద్దాం' అని మంత్రి పిలుపునిచ్చారు. హైటెక్ సిటీలోని సైబర్ గార్డెన్స్‌లో నిర్వహించిన ‘జపాన్ ఫెస్టివల్–2026’ లో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తో కలిసి మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొని మాట్లాడారు. పారిశ్రామిక అవసరాలకు తగిన ప్రాక్టికల్ విద్య, గ్లోబల్ సర్టిఫికేషన్ ద్వారా మన యువతను అంతర్జాతీయ స్థాయి వర్క్‌ఫోర్స్‌గా తీర్చిదిద్దేందుకు ఈ నిర్ణయం దోహదపడనుందన్నారు. ‘తెలంగాణ రైజింగ్–2047’ విజన్‌లో భాగంగా రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చే ప్రయాణంలో జపాన్ భాగస్వామ్యమే కీలకం కానుందన్నారు.
400 జీసీసీల ద్వారా 3 లక్షల మంది నిపుణులు పని
నగరంలో దాదాపు 400కు పైగా అంతర్జాతీయ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు (జీసీసీలు) కొలువుదీరగా, వాటి ద్వారా సుమారు 3 లక్షల మందికి పైగా నిపుణులు పనిచేస్తున్నారని మంత్రి వివరించారు. స్టార్టప్‌లు, పరిశోధనలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న టీ-హబ్, టీ-వర్క్స్, వీ-హబ్ వంటి పర్యావరణ వ్యవస్థలను జపాన్ కంపెనీలు అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ గడ్డపై ఇప్పటికే 169 జపాన్ సంస్థలు విజయవంతంగా కార్యకలాపాలు సాగిస్తుండటం ఇరు ప్రాంతాల మధ్య ఉన్న ఆర్థిక విశ్వసనీయతకు నిదర్శనమని చెప్పారు.
సీఎం రేవంత్‌రెడ్డి నిర్దేశించిన 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్య సాధన కోసం అధునాతన తయారీ రంగం, ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ), సెమీకండక్టర్ల రంగాల్లో జపాన్ సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో ఉన్న దాదాపు 300 పారిశ్రామిక శిక్షణ సంస్థలు (ఐటీఐలు), కొత్తగా అందుబాటులోకి వచ్చిన 119 అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల (ఏటీసీ) ద్వారా అత్యాధునిక శిక్షణను వేగవంతం చేశామన్నారు. 2020 నుంచి 2026 మధ్య కాలంలో ఒక్క విద్యుత్, ఎలక్ట్రానిక్స్ ట్రేడ్లలోనే 1.4 లక్షల మందికి, ఇంజినీరింగ్, తయారీ రంగాల్లో 72 వేల మందికి, ఆటోమోటివ్‌లో 29 వేల మంది అభ్యర్థులకు సర్టిఫికేషన్లు పూర్తి చేసినట్లు వివరించారు. విద్యుత్ శాఖ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీల సమన్వయంతో ఇండస్ట్రియల్ ఆటోమేషన్, ప్రాక్టికల్ పరిజ్ఞానాన్ని పాఠ్యాంశాల్లో తప్పనిసరి చేస్తున్నట్లు చెప్పారు. జపాన్ సాంకేతిక భాగస్వామ్యంతో గ్లోబల్ సర్టిఫికేషన్లు అందజేసి మన యువతను ప్రపంచస్థాయి పోటీకి దీటుగా తయారుచేస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ భారత్-–జపాన్ మైత్రి పరస్పర ప్రజాస్వామిక విలువలు, ఆర్థిక సహకారంతో మరింత బలపడిందన్నారు. రెండో ప్రపంచ యుద్ధ విషాదాన్ని అధిగమించి శాంతికి, మానవ సంకల్పానికి ప్రతీకగా నిలిచిన హిరోషిమా నగరం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని స్పీకర్ కొనియాడారు.
టామ్‌కామ్ ద్వారా ప్రత్యేక కార్యాచరణ
విదేశాల్లో మన యువత మోసపోకుండా పారదర్శక పద్ధతుల్లో ఉద్యోగాలు కల్పించేందుకు 'టామ్‌కామ్' ద్వారా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామని మంత్రి వివేక్ చెప్పారు. ఇప్పటివరకు టామ్‌కామ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా 16 దేశాల్లో 14,500 మందికి పైగా అభ్యర్థులకు సురక్షితమైన ఉపాధి కల్పించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం జపాన్‌లో ఆరోగ్య సంరక్షణ (కేర్‌గివింగ్), ఆటోమోటివ్, అధునాతన తయారీ, నిర్మాణం, ఆతిథ్య, రవాణా రంగాల్లో భారీగా మానవ వనరుల డిమాండ్ ఉందని తెలిపారు. ఇటీవల తాము జరిపిన జపాన్ పర్యటన ఫలితంగా తక్షణమే 500 మంది కేర్‌గివర్లు, డ్రైవర్ల నియామకాలకు సంబంధించి నేరుగా డిమాండ్ లభించిందన్నారు. జపాన్ కంపెనీల అవసరాలకు తగినట్లుగా అభ్యర్థులకు సాంకేతిక శిక్షణతో పాటు భాషా పరిజ్ఞానాన్ని టామ్‌కామ్ ద్వారా తామే పక్కాగా అందించి పంపించే బాధ్యత తీసుకుంటామన్నారు. 2026 ఆగస్టులో తెలంగాణ అధికారిక ప్రతినిధి బృందంతో కలిసి తాను ఒసాకా, హిరోషిమా, మియోషి, టోక్యో నగరాల్లో జరిపిన పర్యటన వివరాలను వివరించారు. తమ పర్యటనలో పరిశీలించిన కిండాయ్ యూనివర్సిటీ, ఫుకుయామా హయ్యర్ టెక్నికల్ స్కూళ్లలోని ప్రాక్టికల్ శిక్షణా విధానాలను ఇక్కడి విద్యాసంస్థల్లో ప్రవేశపెడుతున్నామని పేర్కొన్నారు.
