- ఫాక్స్ కాన్‌లో 87 మంది మహిళలకు అవకాశం
హైదరాబాద్, వెలుగు: సింగరేణి ప్రభావిత ప్రాంతాల నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణతో ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ప్రభుత్వ సంకల్పం సత్ఫలితాలనిస్తోంది. రామగుండం–1 ఏరియాలోని సింగరేణి జీవీటీసీ నైపుణ్యాభివృద్ధి కేంద్రం ద్వారా శిక్షణ పొందిన 112 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. తాజాగా 127 మంది మహిళా అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు కాగా.. వీరిలో 87 మంది హైదరాబాద్‌లోని ఫాక్స్ కాన్ కంపెనీలో జాబ్స్ కు ఎంపికయ్యారు.
మరో 27 మంది పురుష అభ్యర్థులు సోలార్ టెక్నీషియన్ ఇంటర్వ్యూలకు హాజరు కాగా.. వీరిలో 25 మంది ఉద్యోగాల్లో చేరనున్నారు. ఫాక్స్ కాన్కు ఎంపికైన మహిళల్లో తొలి విడతగా 55 మంది ఉద్యోగంలో చేరడానికి ఆదివారం గోదావరిఖని నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు. శిక్షణ నుంచి ఉపాధి వరకు సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో రామగుండం ఏరియాలో రెండేళ్ల క్రితం నైపుణ్యాభివృద్ధి శిక్షణ సంస్థను ఏర్పాటు చేశారు. మార్కెట్ లో డిమాండ్ ఉన్న కోర్సుల్లో శిక్షణ ఇస్తూ ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఫలితంగా గత రెండేళ్లలో 500 మందికి పైగా ఉపాధి అవకాశాలు లభించాయి.
మహిళలకు తయారీ రంగంలో అవకాశాలు
ఫాక్స్‌కాన్ కంపెనీ ఆధ్వర్యంలో గత వారం జీవీటీసీ నైపుణ్యాభివృద్ధి కేంద్రంలో మహిళా అభ్యర్థులకు ప్రత్యేక ఉద్యోగ ఇంటర్వ్యూలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని కంపెనీ తయారీ కేంద్రంలో ఆపిల్ ఇయర్‌పాడ్స్, ఎలక్ట్రానిక్ విడిభాగాల అసెంబ్లింగ్ విభాగాల్లో పనిచేసేందుకు 87 మంది మహిళలను ఎంపిక చేశారు. సోలార్ టెక్నిషియన్ కోర్సులో శిక్షణ పొందిన 25 మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు ఆర్జీ–1 జీఎం డి.లలిత్ కుమార్ తెలిపారు. వీరంతా 10 రోజుల్లో ఎల్ అండ్ ఎన్ కంపెనీలో ఉద్యోగాల్లో చేరనున్నట్లు చెప్పారు.
