మెస్సీ డబుల్‌ ధమాకా.. డీసీ యునైటెడ్‌పై ఇంటర్‌ మయామి ఘన విజయం

మెస్సీ డబుల్‌ ధమాకా.. డీసీ యునైటెడ్‌పై ఇంటర్‌ మయామి ఘన విజయం

మియామి, వెలుగు: అర్జెంటీనా జాతీయ జట్టుకు వీడ్కోలు పలికిన నాలుగు రోజులకే స్టార్‌ ఫుట్‌బాలర్‌ లియోనెల్‌ మెస్సీ మళ్లీ మైదానంలో మెరిశాడు. మేజర్‌ లీగ్‌ సాకర్‌ (ఎంఎల్‌ఎస్‌)లో డీసీ యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు గోల్స్‌ చేసి ఇంటర్‌ మయామికి 4–0తో ఘన విజయాన్ని అందించాడు. ఈ సీజన్‌లో మెస్సీ గోల్స్‌ సంఖ్య 23కు చేరింది. దీంతో లీగ్‌లో అత్యధిక గోల్స్‌ చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. 

మ్యాచ్‌ తొలి అర్ధభాగంలో లూయిస్‌ సువారెజ్‌ రెండు గోల్స్‌ చేసి మయామికి 2–0 ఆధిక్యాన్ని అందించాడు. 47వ నిమిషంలో మెస్సీ తొలి గోల్‌ చేశాడు. 60వ నిమిషంలో రోడ్రిగో డీ పాల్‌ నుంచి బంతిని అందుకున్న మెస్సీ.. ఇద్దరు ప్రత్యర్థి ఆటగాళ్లను తప్పించుకుని మరో గోల్‌ సాధించాడు. 

జర్మన్‌ బెర్టెరామె రెండు అసిస్ట్‌లు అందించాడు. ఈ విజయంతో మయామి ఐదు మ్యాచ్‌ల విజయరహిత పరంపరకు తెరదించింది. ఆగస్టు 29 తర్వాత జట్టుకు లీగ్‌లో ఇదే తొలి విజయం. సెప్టెంబర్‌ 16న బాధ్యతలు చేపట్టిన కొత్త కోచ్‌ క్రిస్టియన్‌ గొంజాలెజ్‌కు ఇది తొలి లీగ్‌ విజయం. డీసీ యునైటెడ్‌ వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ గెలుపొందలేకపోయింది.