జపాన్ ప్రధానిపై బాంబు దాడి.. మొన్ననే మాజీ ప్రధాని హత్య.. 

జపాన్ ప్రధానిపై బాంబు దాడి.. మొన్ననే మాజీ ప్రధాని హత్య.. 

జపాన్ అనగానే టెక్నాలజీ.. గొడ్డులా పని చేసే మనుషులు.. ఓ తరం ముందు ఆలోచించే అద్భుత తెలివి తేటలు ఉన్న దేశంగా అందరికీ తెలుసు.. అయితే రాజకీయాల దగ్గరకు వచ్చే మన కంటే దారుణంగా ఉంటాయా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి కారణం లేకపోలేదు.. ఏప్రిల్ 15వ తేదీ జపాన్ ప్రధాన మంత్రి పుమియో కిషిదా టార్గెట్ గా బాంబు దాడి జరగటమే. వివరాల్లోకి వెళితే..

ప్రధాని కిషిదా.. వకయామా సిటీలో ఓ పబ్లిక్ మీటింగ్ కు హాజరయ్యారు. ఆయన ప్రసంగించటానికి రెడీ అవుతున్న సమయంలోనే సభలో బాంబు పేలింది. ఊహించన ఘటనతో మీటింగ్ కు వచ్చిన జనం పరుగులు తీశారు. ప్రధానమంత్రి సెక్యూరిటీ అప్రమత్తం అయ్యింది. ఆయన్ను కింద పడుకోబెట్టి.. ఆయన చుట్టూ భద్రతా సిబ్బంది అడ్డుగా నిలబడ్డారు. ప్రధాని కిషిదాను వెంటనే అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లారు. బాంబు విసిరిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. వేసింది పొగ బాంబ్ అని కొన్ని మీడియాలు చెబుతున్నాయి. బాంబు వేయటానికి కారణాలు ఏంటీ.. ఎందుకు ఇలా చేశాడు అనే వివరాలు తెలుసుకునేందుకు విచారణ చేస్తున్నారు అధికారులు. 

అయితే జపాన్ దేశంలో కీలక రాజకీయ నేతలపై దాడులు జరగటం ఆరు నెలల్లో ఇది రెండోసారి. మాజీ ప్రధాని షింజో అబేను కూడా ఇదే తరహాలో పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతుండగా తుపాకీతో కాల్చి చంపాడు ఓ వ్యక్తి. ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అబే తీసుకున్న నిర్ణయాల వల్ల నష్టపోయాం అంటూ ఆ వ్యక్తి చెప్పటం విశేషం. 

జపాన్ దేశంలో ప్రధానమంత్రుల టార్గెట్ గా దాడులు పెరగటంపై చర్చ నడుస్తుంది. భ్రదతా వైఫల్యమా లేక మరేదైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో జపాన్ మీడియా పెద్ద ఎత్తున ప్రశ్నలు వేస్తుంది. ప్రస్తుత జపాన్ ప్రధాని కిషిదాపై బాంబు దాడికి కారణాలు ఏంటీ అనేది కూడా తెలియాల్సి ఉంది.