
టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లాండ్ తో మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. 33 ఓవర్లు వేసిన రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. వీటిలో ఒక్కటి కూడా టాపార్డర్ వికెట్ లేదు. బుమ్రా విఫలం కావడంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది. ఈ మ్యాచ్ లో 33 ఓవర్లలో 112 పరుగులు సమర్పించుకున్న బుమ్రా ఒక చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.తన టెస్ట్ క్రికెట్ కెరీర్ లో తొలిసారి 100 పరుగులు పైగా ఇచ్చాడు. ఇప్పటివరకు టెస్ట్ కెరీర్ లో 47 టెస్టులాడిన బుమ్రా.. 100కి పైగా పరుగులివ్వడం ఇదే తొలిసారి.
ఓవరాల్ గా 33 ఓవర్లలో 112 పరుగులు ఇచ్చి జెమీ స్మిత్, డాసన్ వికెట్లు తీసుకున్నాడు. నాలుగో రోజు ఉదయం డాసన్ వికెట్ తీసి టీమిండియాకు బ్రేక్ ఇచ్చాడు. ఈ సిరీస్ లో ఆడిన రెండు టెస్టుల్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన బుమ్రా.. నాలుగో టెస్టులో వికెట్లు తీయడంలో విఫలమయ్యాడు. దీనికి తోడు ఈ పేసర్ బౌలింగ్ ను ఇంగ్లాండ్ బ్యాటర్లు అలవోకగా ఆడేశారు. ఈ మ్యాచ్ లో బుమ్రా ఒక్క బంతికి కూడా 140 కి.మీ వేగంతో విసరలేకపోయాడు. పని భారం కారణంగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో మూడు టెస్ట్ మ్యాచ్ లే ఆడతానని చెప్పిన బుమ్రా.. చివరి టెస్ట్ ఆడతాడో లేదో చూడాలి.
బుమ్రాతో పాటు మిగిలిన బౌలర్లు కూడా విఫలం కావడంతో ప్రస్తుతం ఇంగ్లాండ్ ఆధిక్యం 290 పరుగులకు చేరింది. నాలుగో రోజు స్టోక్స్ సెంచరీ చేయడంతో ఇంగ్లాండ్ వేగంగా పరుగులు రాబట్టింది. ఈ క్రమంలో ఇంగ్లాండ్ ఆధిక్యం 300 కు చేరడం ఖాయంగా మారింది. ప్రస్తుతం క్రీజ్ లో స్టోక్స్ (134), కార్స్ (37) ఉన్నారు. ఓవర్ నైట్ బ్యాటర్ డాసన్ 26 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్ లో ఔటయ్యాడు. భారత బౌలర్లలో సుందర్, జడేజా, బుమ్రా తలో రెండు వికెట్లు తీసుకున్నారు. కంబోజ్,సిరాజ్ లకు ఒక వికెట్ దక్కింది.
Jasprit Bumrah has conceded 100 runs in an innings for the first time in his career 😳 pic.twitter.com/F8LJh3TcqU
— ESPNcricinfo (@ESPNcricinfo) July 26, 2025