Jorich van Schalkwyk: డబుల్ సెంచరీతో శివాలెత్తిన సఫారీ కుర్రాడు.. తొలి ప్లేయర్‌గా వరల్డ్ రికార్డ్

Jorich van Schalkwyk: డబుల్ సెంచరీతో శివాలెత్తిన సఫారీ కుర్రాడు.. తొలి ప్లేయర్‌గా వరల్డ్ రికార్డ్

అండర్ 19 క్రికెట్ లో భాగంగా సౌతాఫ్రికా ఆటగాడు జోరిచ్ వాన్ షాల్క్‌వైక్ సంచలన ఇన్నింగ్స్ తో మెరిశాడు. ట్రై సిరీస్ లో భాగంగా జింబాబ్వేతో జరిగిన యూత్ (అండర్ 19) వన్డేలో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి డబుల్ సెంచరీతో చెలరేగాడు. హరారే వేదికగా శనివారం (జూలై 26) జరిగిన ఈ మ్యాచ్ లో 18 ఏళ్ల షాల్క్‌వైక్.. 153 బంతుల్లో 19 ఫోర్లు, 6 సిక్సర్లతో 215 పరుగులు చేసి వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. అండర్ 19 వన్డే చరిత్రలో డబుల్ సెంచరీ కొట్టిన తొలి ప్లేయర్ గా చరిత్రలో నిలిచాడు. 2018లో కెన్యాపై శ్రీలంక బ్యాటర్ హసితా బోయగోడా అత్యుత్తమ స్కోరు (191) ని బ్రేక్ చేసి టాప్ కు చేరుకున్నాడు. 

ALSO READ | IND vs ENG 2025: బుమ్రా రిటైర్మెంట్ ఇస్తాడు.. కారణం ఇదే: టీమిండియా మాజీ బ్యాటర్

ప్రారంభంలో ఆచితూచి ఆడుతూ 48 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత వేగం పెంచి 86 బంతుల్లో తన సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఇదే సిరీస్ లో మంగళవారం (జూలై 22) బంగ్లాదేశ్‌పై 164 పరుగులు చేసి అజేయంగా నిలిచిన ఈ సఫారీ కుర్రాడు నేడు జరిగిన మ్యాచ్ లో ఏకంగా డబుల్ సెంచరీ కొట్టి చరిత్ర సృష్టించాడు. జోరిచ్ వాన్ షాల్క్‌వైక్ విధ్వంసంతో సౌతాఫ్రికా అండర్-19 జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 385 పరుగుల భారీ స్కోర్ చేసింది. సౌతాఫ్రికా యూత్ వన్డేల్లో వారి అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం. 2012లో బ్రిస్బేన్‌లో నమీబియాపై (359/6) రికార్డ్ నేడు బ్రేక్ అయింది. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 385 పరుగుల భారీ స్కోర్ చేసింది. షాల్క్‌వైక్ 153 బంతుల్లో 19 ఫోర్లు, 6 సిక్సర్లతో 215 పరుగులు చేసి జట్టు స్కోర్ లో సగం కంటే ఎక్కువ పరుగులు చేశాడు. జాసన్ రౌల్స్ (79 బంతుల్లో 76) తో కలిసి మూడో వికెట్‌కు 178 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పగా.. పాల్ జేమ్స్ (41) తో కలిసి నాలుగో వికెట్ కు 105 పరుగులు జోడించాడు. లక్ష్య ఛేదనలో ఆతిధ్య జింబాబ్వే జట్టు 24.3 ఓవర్లలో 107 పరుగులకే కుప్పకూలింది. దీంతో జింబాబ్వేపై సౌతాఫ్రికా 278 పరుగుల తేడాతో విజయం సాధించింది.