బీజేపీ మద్దతుకు ప్రయత్నాలు.. మెదక్, నర్సాపూర్ చైర్పర్సన్ పదవులపై వీడని సస్పెన్స్

బీజేపీ మద్దతుకు ప్రయత్నాలు.. మెదక్, నర్సాపూర్ చైర్పర్సన్ పదవులపై వీడని సస్పెన్స్
  •       రెండు చోట్ల బీజేపీ కౌన్సిలర్ల మద్దతు అనివార్యం

మెదక్, నర్సాపూర్, వెలుగు: మెదక్, నర్సాపూర్ మున్సిపల్ చైర్​పర్సన్ పీఠాలు ఏ పార్టీకి దక్కుతాయి?  చైర్​పర్సన్ ఎవరు అవుతారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మెదక్, నర్సాపూర్ రెండు చైర్​పర్సన్ పదవులను దక్కించుకొని బీఆర్ఎస్ కు చెక్ పెట్టాలని అధికార కాంగ్రెస్ ప్లాన్ చేస్తుండగా, రెండు చైర్​పర్సన్ పదవులను కైవసం చేసుకొని అధికార పార్టీ ఆధిపత్యానికి బ్రేక్ వేయాలని బీఆర్ఎస్ చూస్తోంది. రెండు చోట్ల ఈ రెండు పార్టీల్లో ఎవరికి చైర్​పర్సన్ పదవి దక్కాలన్న బీజేపీ కౌన్సిలర్ల మద్దతు అనివార్యం. దీంతో కమలం పార్టీ మద్దతు కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. 

మెదక్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కు సమాన కౌన్సిలర్ల బలం ఉండగా చైర్​పర్సన్ పదవి దక్కడానికి బీజేపీ కౌన్సిలర్ల సపోర్టు కీలకంగా మారింది. నర్సాపూర్ లో సైతం కాంగ్రెస్ కు ఆరుగురు, బీఆర్ఎస్ కు ఐదుగురు కౌన్సిలర్ల బలం ఉండగా నలుగురు బీజేపీ కౌన్సిలర్లు ఎవరికి సపోర్ట్ చేస్తే వారికి చైర్​పర్సన్ పదవి దక్కుతుంది. 

ఈ మేరకు కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, మాజీ మంత్రి హరీశ్ రావు బీజేపీ రాష్ట్ర నాయకులతో, ఎంపీ రఘునందన్ రావుతో చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. మెదక్ లో చైర్​పర్సన్ పదవి కోసం కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తే వైస్ చైర్​పర్సన్ పదవి బీజేపీకి ఇచ్చేలా.. నర్సాపూర్ లో చైర్​పర్సన్ పదవి కోసం బీజేపీకి సపోర్ట్ చేస్తే కాంగ్రెస్ కు వైస్ చైర్​పర్సన్ ఇచ్చేలా చర్చలు జరిగినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.  

మెదక్ లో 15 మంది కౌన్సిలర్ల బలం ఉన్న బీఆర్ఎస్ సైతం చైర్​పర్సన్ పదవి కోసం తమకు సపోర్ట్ చేస్తే బీజేపీకి వైస్ చైర్​పర్సన్ పదవి ఇస్తామని, నర్సాపూర్ లో చైర్​పర్సన్ పదవి కోసం బీజేపీకి మద్దతు ఇస్తామని చెబుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీ  సిద్ధాంతాలు, ఆయా పార్టీల ముఖ్య నాయకులతో ఉన్న విబేధాలు, భవిష్యత్​ను దృష్టిలో పెట్టుకొని బీజేపీ మున్సిపల్ చైర్​పర్సన్ ఎన్నికల్లో ఏ పార్టీకి సపోర్ట్ ఇవ్వాలనే విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. 

మెదక్ లో గెలుపొందిన ఇద్దరు బీజేపీ కౌన్సిలర్లు మాత్రం ఎంపీ రఘునందన్ రావు నిర్ణయానికి అనుగుణంగా వ్యవహరించాలని స్పష్టం చేస్తున్నట్టు సమాచారం. నర్సాపూర్ లో బీజేపీ కౌన్సిలర్లు నలుగురు ఉండడంతో  చైర్​పర్సన్ పదవి కోసం పట్టుబడుతున్నట్టు తెలిసింది. బీజేపీ కౌన్సిలర్ల సపోర్ట్ విషయంలో ఇంకా తుది నిర్ణయం జరగనప్పటికీ  కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు  మాత్రం బీజేపీ కౌన్సిలర్ల సపోర్ట్ తమకే లభిస్తుందని చైర్​పర్సన్ పీఠం తమదేనని చెబుతుండడం గమనార్హం. 

ఎక్స్ అఫిషియో ఓటు కోసం నలుగురు దరఖాస్తు

మెదక్ మున్సిపల్ చైర్​పర్సన్ ఎన్నికల్లో ఎక్స్ అఫిషియో ఓటు  వేసేందుకోసం కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్యే రోహిత్ రావు, బీఆర్ఎస్ కు చెందిన రాజ్యసభ సభ్యుడు సురేశ్ రెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి, దేశపతి శ్రీనివాస్ దరఖాస్తు చేసుకున్నారు. ఎలక్షన్ కమిషన్ సర్క్యులర్  ప్రకారం బీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్సీకు స్థానికంగా ఓటు హక్కు లేకపోవడంతో వారు ఇక్కడ ఓటు వేసే పరిస్థితి లేదు. ఈ పరిణామం కూడా మున్సిపల్ చైర్​పర్సన్ ఎన్నికలో కీలకం కానుంది.