టీ20 క్రికెట్‎లో బుమ్రా చీట్ కోడ్: ముంబై పేసర్‎పై అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టీ20 క్రికెట్‎లో బుమ్రా చీట్ కోడ్: ముంబై పేసర్‎పై అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఐపీఎల్ 18లో భాగంగా గుజరాత్ టైటాన్స్‎తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచులో ముంబై ఇండియన్స్ ఉత్కంఠ విజయం సాధించింది. చివరి వరకు నువ్వా నేనా అన్నట్లుగా సాగిన ఈ మ్యాచులో 20 పరుగుల తేడాతో గుజరాత్‎ను చిత్తు చేసి ముంబై క్వాలిఫయర్ 2కు దూసుకెళ్లింది. ఈ మ్యాచులో ముంబై ఇండియన్స్ 228 పరుగులు చేయగా.. గుజరాత్ 208 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. అయితే.. భారీ ఛేదనలో జీటీ కూడా ధీటుగానే ఆడింది. జీటీ బ్యాటర్స్ సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా పోరాడారు. వీరిద్దరూ ధాటిగా ఆడటంతో ఒక దశలో గుజరాత్ గెలిచేలా కనిపించింది. కానీ ముంబై స్టార్ పేసర్ బుమ్రా గుజరాత్‎ను దెబ్బకొట్టాడు.

గుజరాత్‎ను విజయం దిశగా తీసుకెళ్తోన్న సాయి సుదర్శన్, సుందర్ జోడీని కీలక సమయంలో విడదీశాడు. 14 ఓవర్లో ఏ బ్యాటర్‎కైనా ఆడటానికి కష్టమైన యార్కర్‎తో సుందర్‎ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 84 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. గిల్ సేనకు అప్పటి వరకు గెలుస్తామనే చిన్న ఆశ ఉండగా.. జీటీ గెలుపు ఆశలపై బుమ్రా నీళ్లు చల్లాడు. ఈ క్రమంలో బుమ్రా అద్భుత ప్రదర్శనపై ప్రశంసలు కురుస్తున్నాయి. టీమిండియా మాజీ స్టార్ స్పిన్నర్ అశ్విన్ కూడా బుమ్రాను కొనియాడాడు. టీ20 క్రికెట్‌లో జస్ప్రీత్ బుమ్రా ఒక చీట్ కోడ్ అని.. అతడు కెప్టెన్ స్థాయిని మరింత పెంచుతాడని అశ్విన్ ప్రశంసించాడు.

అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్ 'ఆష్ కి బాత్'లో మాట్లాడుతూ.. ‘‘బుమ్రా 14 ఓవర్ వేయకపోతే ఆట ఇంకా క్లోజ్‎గా వెళ్లేది. రిక్వైర్డ్ రన్ రేట్ ఓవర్‎కు 12, 13, 14 ఉండగా.. బుమ్రా తన చివరి రెండు ఓవర్లలో 7 లేదా 8 పరుగులే ఇచ్చాడు. బుమ్రా బౌలింగ్‎లో రాహుల్ తెవాటియా ఒక సిక్స్ కొట్టాడు. కానీ తర్వాతి రెండు బంతుల్లో ఒక పరుగు మాత్రమే ఇచ్చాడు. నేటి T20 క్రికెట్‌లో బుమ్రా చీట్ కోడ్ అని నేను T20 వరల్డ్ కప్ సందర్భంగా ట్వీట్ చేశా. మీరు ఎప్పుడైనా ఈ రోడ్ రాష్, NFS గేమ్ ఆడారా..? ఈ ఆటల్లో చీట్ కోడ్ ఎంటర్ చేస్తే మీరు వేగంగా పరిగెత్తుతారు. ఇతరుల్ని ఓడిస్తారు. అచ్చం ఇలాగే.. కెప్టెన్ కూడా వికెట్ కావాలన్నప్పుడు బుమ్రాను ఒక చీట్ కోడ్ లాగా ఉపయోగిస్తారు. అప్పుడు బుమ్రా యార్కర్స్, స్లో బాల్స్‎తో వికెట్ తీసి కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టి.. అతని స్థాయిని మరింత పెంచుతాడని పేర్కొన్నారు.